AP Inter Exam Fee : ఏపీ ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజులు చెల్లింపు ప్రారంభం, నవంబర్ 11 చివరి తేదీ
AP Inter Exam Fee : ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. విద్యార్థులు నవంబర్ 11 వరకు వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్ పరీక్షలుక ఫీజులు చెల్లించవచ్చు. అలాగే ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు నవంబర్ 15లోపు ఫీజు చెల్లించాలి.
ఏపీలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు నేటి(అక్టోబర్ 21) నుంచి ప్రారంభం అయ్యింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అక్టోబరు 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు థియరీ సబ్జెక్టులకు రూ. 600, సెకండియర్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు రూ. 275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ. 165 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండు సంవత్సరాల థియరీ పరీక్షలకు రూ. 1200 ఫీజలు చెల్లించాల్సి ఉంటుంది. హాజరు మినహాయింపు కోరే ప్రైవేటు అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు రూ. 1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
ప్రైవేటు విద్యార్థుల ఫీజులు
ఇంటర్ పరీక్షలను ప్రైవేటుగా రాసే విద్యార్థులకు హాజరు మినహాయింపునిచ్చారు. ఇందుకోసం నవంబర్ 15వ తేదీలోపు ప్రైవేట్ విద్యార్థులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 పెనాల్టీతో నవంబర్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ప్రైవేటుగా ఇంటర్ పరీక్షలు రాసేందుకు పదో తరగతి పాసై ఏడాది పూర్తయిన విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, రెండేళ్లు దాటిన వారు ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరు కావొచ్చు.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు అధికారులు. ఈ మేరకు మరో ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీ గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ తేదీలోపే ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాలని సూచించారు. ఆన్ లైన్ ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 24వ తేదీలోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబర్ 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమవుతాయి. ఇందుకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.అక్టోబర్ 29వ తేదీన వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్లు కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 4వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు:
- ఏపీ లాసెట్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు - 23 అక్టోబర్ 2024.
- ధ్రువపత్రాల పరిశీలన - 24 అక్టోబర్ 2024.
- వెబ్ ఆప్షన్లు - 25 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ ,2024.
- వెబ్ ఆప్షన్లు ఎడిట్ - 29 అక్టోబర్ 2024.
- సీట్ల కేటాయింపు - 2 నవంబర్ 2024.
- రిపోర్టింగ్ సమయం - 4 నవంబర్ నుంచి 7 నవంబర్ 2024.
- అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/
సంబంధిత కథనం