తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Trains Elephants For Gaja Vahana Seva In Brahmotsavam

TTD Brahmotsavams : బ్ర‌హ్మోత్స‌వాల్లో గ‌జ‌రాజులు, అశ్వాలు, వృష‌భాల రాజ‌సం

B.S.Chandra HT Telugu

18 September 2022, 10:05 IST

    • TTD Brahmotsavams శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలది కీలకపాత్ర పోషిస్తాయి. స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు ఈ జంతువులదే ఉంటుంది. భక్తులకు ముందుగా ఇవే కనువిందు చేస్తాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారన్న సంకేతం ఇస్తాయి.
తిరుమలలో గజవాహన సేవకు సిద్ధమైన ఏనుగులు
తిరుమలలో గజవాహన సేవకు సిద్ధమైన ఏనుగులు

తిరుమలలో గజవాహన సేవకు సిద్ధమైన ఏనుగులు

TTD Brahmotsavams రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో గజవాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. స్వామి వారి సేవలో తరిస్తున్న శ్రీ‌నిధికి 14 ఏళ్ల వయసు, ల‌క్ష్మీకి 45 ఏళ్లు వయసు ఉంది. వాహ‌న‌ సేవల కోసం వీటికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చారు. కేర‌ళ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు వీటికి శిక్షణ అందించారు. బ్రహ్మోత్సవాలకు అట్టహాసం తీసుకువస్తున్న ఘనత వీటికే దక్కుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ జంతువుల ఆలనా పాలనా చూస్తూ సంరక్షిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

లక్ష్మీ నుంచి శ్రీనిధి వరకు ....

గజం ఐశ్వర్యానికి చిహ్నం. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీ లక్ష్మీదేవి ఇష్టవాహనం కూడా ఏనుగే. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకట్వేరుని వైభవాన్ని సిరిసంపదలకు సూచికలైన ఏనుగులు ఇతర జంతువులైన గుర్రాలు, వృషభాలతో కలిసి మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గజాల్లో 14 ఏళ్ల శ్రీనిధి అన్నిటికంటే చిన్నది. 45 ఏళ్ల లక్ష్మి అన్నిటికంటే పెద్దది.

ఏనుగుల సంరక్షణ చూస్తున్న ఎస్వీ గోసంరక్షణశాల సంచాలకులు డాక్ట‌ర్‌ హరనాథరెడ్డి మాట్లాడుతూ హార్మోన్లు విడుదల సమయంలో మగ ఏనుగులను అదుపు చేయడం కష్టతరమని, ఈ కారణంగా వాటిని ఉంచడం లేదని తెలిపారు. ఉన్న ఏనుగులకు ప్రతీ రోజు ఆలయాల ఉత్సవ సేవలలో మరియు గోశాలలో నడక ద్వారా వ్యాయామం, శరీర మర్దన చేస్తారు. ప్రతి అరగంటకు ఒకసారి ఏనుగులకు ఆహారం అందించడంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయ మాడవీధుల్లో వాహనసేవల సమయంలో శక్తివంతమైన విద్యుత్‌ దీపాల వెలుగులు, కళాకారుల వాయిద్యాల శబ్దం నుంచి ఏనుగులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు కొన్ని రోజుల ముందు నుంచి వాటిని మచ్చిక చేసుకుని బ్రహ్మోత్సవాలకు సమాయత్తం చేస్తారు. ప్రతి 20 నిమిషాలకోసారి చెరుకుగడలు, నేపియర్‌ గ్రాసం అందిస్తారు.

కేర‌ళ నుండి వైద్య నిపుణుల రాక‌:

బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ కూడా ఇస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం, గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు. జంతువులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. జంతువుల వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని సంఘటనలు జరిగినపుడు జంతువులను నియంత్రించేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా రూపొందించారు. ఏనుగులను అదుపు చేసేందుకు కేరళ నుంచి నిపుణులైన‌ పశువైద్యులను రప్పిస్తారు.

ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌….

వాహనసేవల్లో పాల్గొనే జంతువులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గజరాజులను ముఖపట్టాతోపాటు రంగురంగుల బొంతలతో అలంకరిస్తారు. మావటిలు గొడుగులు, విసనకర్రలతో స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. గరుడసేవనాడు ప్రత్యేకంగా అలంకరిస్తారు. అశ్వాలు రాజసానికి చిహ్నాలు. వీటిని ముఖపట్టా, తలపై కుచ్చు, బొంతలు, మెడగజ్జలు, కాళ్లపట్టీలతో అలంకరిస్తారు. రైతన్నలకు నేస్తాలైన ధర్మానికి ప్రతీకగా నిలిచే వృషభాలను మెడలో నల్లతాడు, పూలహారాలు, గజ్జలు, బొంతలతో అలంకరిస్తారు. వాహనసేవల్లో ఈ జంతువులకు ఇష్టమైన రావి ఆకులు, మర్రి ఆకులు, రాగి సంకటి, చెరకు గడలను ఆహారంగా ఇస్తారు. మాడ వీధుల్లో తిరిగే సమయంలో క్రమం తప్పకుండా ఆహారాన్ని, ఆలయం వద్ద నీటిని అందిస్తూ ఉంటారు.

తిరుమ‌లలోని ఎస్వీ గోశాల‌లో పాడి ఆవులు, లేగ దూడలు, మేలురకం ఎద్దుల‌తో కలిపి మొత్తం 45 గోవులున్నాయి. గోశాలకు ఆనుకుని ఉన్న సుమారు 8 ఎకరాల స్థలాన్ని చదును చేసి గోవులు తిరిగేందుకు అనువుగా మారుస్తున్నారు. సుమారు 100 గోవులు ఉంచేందుకు వీలుగా షెడ్డు నిర్మించ‌నున్నారు. శ్రీ‌వారి తోమాలసేవ, అభిషేకం, ఏకాంత సేవ, నవనీత సేవ కోసం పాలు, పెరుగు, వెన్న తదితర పదార్థాలను ఇక్క‌డినుంచే తీసుకెళ‌తారు. మజ్జిగను అన్నదానం కాంప్లెక్స్‌కు సరఫరా చేస్తారు.

టాపిక్