తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd News: టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక మహా దీపోత్సవం

TTD News: టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక మహా దీపోత్సవం

HT Telugu Desk HT Telugu

18 November 2022, 22:16 IST

  • TTD karthika deepotsavam: టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.

టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన కార్తీక దీపోత్సవం
టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన కార్తీక దీపోత్సవం

టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన కార్తీక దీపోత్సవం

TTD karthika deepotsavam: రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు. ఈ సందర్బంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు.

TTD karthika deepotsavam: శివ కేశవ పూజల ప్రత్యేక కార్యక్రమాలు

కార్తీక మాసంలో టీటీడీ శివ కేశవ పూజల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కార్తీక మాసంలో యాగంటి, విశాఖపట్నం, తిరుపతి లో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో భక్తి ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు టీటీడీ కృషి చేస్తుందని ఈవో చెప్పారు.

TTD karthika deepotsavam: కార్తీక మహా దీపోత్సవం ఇలా..

పవిత్రమైన కార్తీక మాసం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగాజరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం చేశారు. పండితులు డాక్టర్ మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం డాక్టర్ మారుతి దీప ప్రాశస్త్యం తెలియజేశారు.

Annamacharya project: శ్రీవారి తిరువారాధన

అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా శ్రీవారి తిరువారాధన నిర్వహించారు. పండితులు విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన దీపలక్ష్మి నమోస్తుతే నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది . భక్తులతో దీప మంత్రం 9 సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్క సారిగా చేసిన దీపారాధన వెలుగులతో మైదానం నిండింది. చివరగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. జేఈవో సదాభార్గవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు .

TTD karthika deepotsavam: భారీగా పాల్గొన్న భక్తులు

అర్చక బృందం , వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించింది. కార్యక్రమం అనంతరం దాతలను ఈవో ధర్మారెడ్డి సన్మానించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.