తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Brahmotsavalu Lord Venkateswara On Golden Chariot

Tirumala Brahmotsavalu : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం

HT Telugu Desk HT Telugu

03 October 2022, 8:15 IST

    • Tirumala Brahmotsavalu తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరించారు.  బంగారు వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించేందుకు లక్షలాది భక్తులు తిరుమల గిరులపైకి తరలి వచ్చారు.  బ్రహ్మోత్సవాలలో స్వామి వారి దర్శన భాగ్యం కోసం భక్తులు గంటల తరబడి గ్యాలరీల్లో ఎదురు చూస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో  తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. 
బంగారు వాహనంపై విహరిస్తున్న స్వామివారు
బంగారు వాహనంపై విహరిస్తున్న స్వామివారు

బంగారు వాహనంపై విహరిస్తున్న స్వామివారు

Tirumala Brahmotsavalu శ్రీవారి న‌వ‌హ్నిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించాడు. దాస భక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగ‌ళ‌వాయిధ్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వ‌ర్ణ‌ర‌థ‌న్ని లాగారు.

శ్రీవారికి శ్రీ, భూదేవులు ఇరుప్రక్కలా ఉన్నారు. శ్రీదేవి(లక్ష్మి) సువర్ణమయి. ఆమే బంగారు కాగా, ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందమని చెబుతారు. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహా శక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైనదనిగా భావిస్తారు

'స్వర్ణ' మంటే 'బాగా ప్రకాశించేది' అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమి నుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం - స్వామివారి మహోన్నతినీ, సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.

ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయి.ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మ‌న్వైవి.సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.