తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Atm Fraud In Vizag: చిన్న టెక్నిక్... 95 సార్లు విత్ డ్రా, రూ. 9 లక్షలు స్వాహా!

ATM Fraud in Vizag: చిన్న టెక్నిక్... 95 సార్లు విత్ డ్రా, రూ. 9 లక్షలు స్వాహా!

HT Telugu Desk HT Telugu

14 December 2022, 11:02 IST

    • 3 arrested in stealing cash from ATMs: విశాఖలో ఏటీఎంల నుంచి డబ్బు కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9.50 లక్షలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంలలో డబ్బులు మాయం
ఏటీఎంలలో డబ్బులు మాయం

ఏటీఎంలలో డబ్బులు మాయం

Stealing 9.5 lakh from ATMs in Vizag Case: చిన్న టెక్నిక్ తెలుసుకున్నారు...! ప్లాన్ లో భాగంగా ఓ బ్యాంక్ లో ఖాతాలు తీసుకోవటంతో పాటు ఏటీఎంలు తీసుకుంటారు. తెలిసిన టెక్నిక్ తో డబ్బులు కాజేయటం మొదలుపెట్టారు. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా 90 సార్లు డ్రా చేశారు. డబ్బు మాత్రం వస్తుంది... కానీ వారి ఖాతాలో కట్ అయినట్లు ఉండదు. లెక్కల్లో భారీ తేడా కొట్టడంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఎంట్రీతో ఈ ముఠా గుట్టురట్టు అయింది. మొత్తం రూ. 9.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం కార్డులను కూడా సీజ్ చేశారు.

బటన్ ఆఫ్…

విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌ చెందిన షారూక్‌ 2017 నుంచి విశాఖలో చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడు గత నెల 30న అదే రాష్ట్రానికి చెందిన రషీద్‌(24), సాయికూల్‌(25), ముస్తకీమ్‌(21) తో కలిసి విశాఖ సిటీకి వచ్చి ఓ లాడ్జిలో ఉన్నారు. వారు తమ ప్రాంతానికే చెందిన కొందరితో స్థానికంగా ఉన్న కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్‌ బ్యాంకులో ఖాతాలు తెరిపించారు. కానీ ఖాతాదారుల డెబిట్‌ కార్డులను వారి వద్దే ఉంచుకున్నారు. వారితో కొంత నగదు అకౌంట్లలో వేయిస్తారు. తర్వాత వారి ప్లాన్ ను వర్కౌట్ చేస్తారు.

ముందుగా ఆ బ్యాంకు బ్రాంచి ఏటీఎంలో వారి ప్లాన్ ను అమలు చేశారు. నగదు విత్‌డ్రాకు కార్డు పెట్టిన తర్వాత డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం మిషన్ పవర్‌ బటన్‌ను ఆపేసి వెంటనే ఆన్‌ చేస్తారు. ఆ సమయంలో ఏటీఎం నుంచి నోట్లు బయటకు వచ్చినా.. అవి క్యాసెట్‌ మధ్యలో ఉండగానే పవర్‌ ఆపేయడం వల్ల లావాదేవీని తప్పుగా చూపుతుంది. సంబంధిత ఖాతాదారుకు నగదు విత్‌ డ్రా అయినట్లు సమాచారం వెళ్లినా వెంటనే తిరిగి ఆ మొత్తం జమ అయినట్లు మేసేజ్ వస్తుంది. ఈలోగా వారు క్యాసెట్‌ మధ్యలో ఉండిపోయిన నోట్లను లాగేస్తారు. ఇలా వేర్వేరు ఏటీఎంల నుంచి 95 సార్లు డబ్బులను విత్‌డ్రా చేశారు.

లెక్కల్లో తేడా కొట్టడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు డిసెంబర్ 12వ తేదీన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు షారూక్‌ పరారీలో ఉండడంతో మిగిలిన వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.91 లక్షల నగదు, 78 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కూడా దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.