తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  The President Of The Government Employees Union Is Absconding And The Leaders Are Cooperating With The Police Investigat

APGEA Leader: పరారీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు..

HT Telugu Desk HT Telugu

05 June 2023, 10:13 IST

    • APGEA Leader: వేతనాల చెల్లింపు, బకాయిల విడుదల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వ ఉద్యోగం సంఘం అధ్యక్షుడిపై పోలీస్ కేసు నమోదు కావడంతో అదృశ్యమయ్యారు.  జిఎస్టీ అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తుతో ఏపీజీఈఏ అధ్యక్షుడు మాయం కావడం చర్చగా మారింది. 
కేఆర్ సూర్యనారాయణ
కేఆర్ సూర్యనారాయణ (file Photo )

కేఆర్ సూర్యనారాయణ

APGEA Leader: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో జిఎస్టీ వసూళ్లలో అక్రమాలు జరిగాయంటూ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడిగా ఏపీజీఈఏ అధ్యక్షుడుసూర్య నారాయణపై కేసు నమోదైంది. దీంతో సంఘం నాయకులపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఆరోపసించారు.

పోలీసులు ఎవరి ప్రోద్బలంతో తమను వేధిస్తున్నారో తెలియడం లేదని వివరించారు. ఇప్పటికే నలుగురు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను అరెస్టు చేశారని, ఐదో వ్యక్తిగా తమ సంఘం అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణను చేర్చారని తెలిపారు. సూర్యనారాయణ శుక్రవారం నుంచి తమతో లేకపోయినా తమ సంఘం సభ్యుల ఇళ్లకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారని, దాంతో కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. సోమవారం నుంచి తాము విజయవాడలో ఉంటానని, విచారణకు సహకరిస్తామని, తమపై పోలీసుల వేధింపులు ఆపాలని కోరారు.

మరోవైపు ఏపీజీఈఏ అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వేతన బకాయిలతో పాటు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొద్దినెలల క్రితం ఏపీజీఈఏ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఉద్యోగుల అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిఎస్టీ వసూళ్లలో వ్యాపారులన బెదిరించడం, వారితో కుమ్మక్కై ఖజానాకు గండికొట్టడం వంటి మోసాలు ఆడిట్‌లో బయటపడ్డాయి. దీంతో ప్రభుత్వం కొందరిని అరెస్ట్ చేసింది. ఈకేసులో ఏపీజీఈఏ అధ్యక్షుడి కోసం పోలీసులు గాలిస్తుండటంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలను చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సోమవారం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి హాజరుకావాలంటూ వివిధ ఉద్యోగ సంఘాల నేతలకు సాధారణ పరిపాలన శాఖ నుంచి సమాచారం అందింది. డీఏ, పీఆర్సీ బకాయిలు, కొత్త పీఆర్సీ నియామకం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.