తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  The Cid Asp Said That The Guide Md Was Not Cooperating With The Cid Investigation

AP CID On Margadarsi: విచారణకు మార్గదర్శి ఎండీ సహకరించడం లేదన్న సిఐడి ఏఎస్పీ

HT Telugu Desk HT Telugu

07 June 2023, 12:15 IST

    • AP CID On Margadarsi: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ విచారణలో సంస్థ ఎండి శైలజా కిరణ్‌ సిఐడి అధికారులకు సహకరించలేదని కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్పీ రవికుమార్‌ స్పష్టం చేశారు.  చెప్పిన విషయాలే చెప్పడం తప్ప సిఐడి ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వడం లేదన్నారు. 
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు (twitter)

మార్గదర్శి చిట్ ఫండ్ కేసు

AP CID On Margadarsi: మార్గదర్శి సంస్థపై వేధింపులు లక్ష్యంగా దర్యాప్తు చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు ఆరోపణలు చేస్తున్నారని, సంస్థ ఎండిని విచారణలో భాగంగా రోజంతా అడిగిన ప్రశ్నలే అడిగారని, సిఐడిపై లేనిపోని ఆరోపణలు చేశారని, మార్గదర్శి విశ్వసనీయత దెబ్బతీస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని కథనాలు ప్రచురించారని, ఇవన్నీ నిరాధారమైనవని ఏపీసిఐడి ప్రకటించింది.

మార్గదర్శికి సంస్థకు అనుకూలంగా ఒకే యాజమాన్యానికి, ఒకే వ్యక్తికి, ఒకే సంస్థకు చెందిన మీడియా సంస్థలో ఏపీసిఐడికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

చిట్‌ఫండ్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి చట్టబద్దంగా, చట్టానికి అనుగుణంగా సిఐడి దర్యాప్తు చేస్తోందని అడిషనల్ ఎస్పీ రవికుమార్‌ తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మార్గదర్శి వ్యవహారంలో దర్యాప్తు సమయంలో స్పష్టమైన ఆధారాలు లభించాయని, ఈ కేసులో ఏమి చేశారో ఆధారాలతో సహా సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు.

చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోడానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించడాన్ని తప్పు పట్టారు. మార్గదర్శి ఎండి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం లేకుండా సహకరించామని చెప్పారు. మహిళగా ఆమెకు ఎలాంటి అంతరాయం, ఇబ్బంది కలగకుండా విచారణ చేస్తున్నామని సిఐడి ఎస్పీ తెలిపారు.

మార్గదర్శి విచారణకు వెళ్లినపుడు ఒక్కోసారి ఒక్కోరకంగా స్పందిస్తున్నారని, చెప్పిందే చెప్పడమో, సూటిగా సమాధానం చెప్పకుండా దాట వేయడమో చేస్తున్నారని వివరించారు. సిఐడి దర్యాప్తు బృందంలో రకరకాల వ్యక్తులు ఉంటారని, సాంకేతిక సందేహాల కోసం అయా రంగాలకు చెందిన నిపుణులను తమ వెంట తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

మంగళవారం హైదరాబాద్‌లో సిఐడి పోలీసులు మాత్రమే వెళ్లాలని ఆటంకాలు కలిగించారని, తమకు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అడ్డుకున్నారని, కోర్టు ఆదేశాలు చూపించాలని అడగడంతో రోడ్డుపైనే నిలిపివేసి సిఐడి సిబ్బందికి అటంకాలు సృష్టించారన్నారు.

ఈనాడు ఎండికి కావాల్సిన అన్ని సదుపాయాలను సిఐడి కల్పించిందని అయినా సమాధానం చెప్పకుండా, ఆ వివరాలు మేనేజర్ల వద్ద ఉంటాయని, వాటివివరాలు తనవద్ద ఉండవని దాటవేశారని చెప్పారు.

తాజా విచారణలో 25శాతం మాత్రమే సమాధానాలు చెప్పారని, మరోసారి ఖచ్చితంగా విచారణ చేయాల్సి ఉందన్నారు. మార్గదర్శి ఎండి సిఐడి విచారణకు వెళ్లిన ప్రతిసారి సాకులు చెబుతున్నారని, ఉద్దేశపూర్వకంగానే దాటవేస్తున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు. బుధవారం కూడా విచారణ కొనసాగిస్తామని చెబితే తనకు వీలు కాదన్నారని సిఐడి అడిషనల్ ఎస్పీ చెప్పారు.

మార్గదర్శి యాజమాన్యానికి చెందిన మీడియా సంస్థల్లో సిఐడిపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిలో ఎలాంటి నిజాలు లేవన్నారు. విచారణ ప్రక్రియకు ఎండి సహకరించారని, దర్యాప్తుకు మాత్రం సహకారం అందించలేదన్నారు. దర్యాప్తులో సిఐడి లేవనెత్తే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహారంలో సిఐడిపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టంచేశారు.