TDP Buddha venkanna: టిక్కెట్ తిప్పలు.. నడిరోడ్డుపై టీడీపీ నాయకుడి వింత చేష్టలు… రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం….
19 February 2024, 7:05 IST
- TDP Buddha venkanna: ఎన్నికల వేళ రాజకీయ నాయకుల్ని ప్రసన్నం చేసుకునేందుకు చిత్రవిచిత్రమైన చేష్టలు సాధారణమే అయినా విజయవాడలో ఓ టీడీపీ నాయకుడు చేసిన పనికి అంతా ముక్కున వేలేసుకున్నారు.
టిక్కెట్ కోసం విజయవాడలో టీడీపీ నాయకుడి వింత చేష్టలు
TDP Buddha venkanna: చంద్రబాబు అంటే నాకు స్వామి భక్తి అంటూ ఓ నాయకుడు చేసిన విపరీత చర్యలు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో టీడీపీ-జనసేన Janasena పొత్తు నేపథ్యంలో జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇదే టిక్కెట్ ఆశిస్తోన్న టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న వెరైటీ కాన్సెప్ట్‌తో concept రోడ్డు మీద స్వామి భక్తిని చాటుకున్నారు.
చంద్రబాబు మీద స్వామిభక్తి చాటుకుంటున్నాను అంటూ బుద్దా వెంకన్న రోడ్డు మీద ఒంట్లో నుంచి రక్తం తీయించుకుని విచిత్రంగా ప్రవర్తించాడు. చూసే వారికి తమ అభిమాన నాయకుడి కోసం రక్త దానం చేస్తున్నారు అనుకున్నా చివరకు రక్తంతో అభిషేకం చేస్తున్నానని చెప్పారు. చంద్రబాబు మీద స్వామి భక్తితో ఇలా చేస్తున్నానని చెప్పుకున్నారు.
చంద్రబాబు నాకు దేవుడు, టికెట్ పై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా నేను విమర్శించనని, తనకు టిక్కెట్ కేటాయించాలనే విషయం చంద్రబాబుకు తెలియాలనే ఇలా చేస్తున్నానని, ఇది నిరసన కాదని చెప్పుకొచ్చారు.
విజయవాడ వెస్ట్ నుంచి తనను తప్పించాలని కేశినేని నాని పట్టుబట్టారని, తన స్థానంలో వేరే వాళ్లను పెట్టాలని కేశినేని ప్రయత్నించినా, చంద్రబాబు తన గౌరవం పెంచారు కానీ.. ఎక్కడా తగ్గించలేదని, నా ప్రేమ, నా బాధ చంద్రబాబుకు తెలియడం కోసం రక్తంతో అభిషేకం చేస్తున్నానంటూ హడావుడి చేశారు. ఇంత కన్నా తానేం నిరూపించుకోవాలని, ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లాల్సిందే అని చంద్రబాబుకు చెప్పానన్నారు.
ఆ తర్వాత ‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’ అంటూ రక్తంతో గోడపై రాశారు. తన నివాసంలో గోడపై ఆయన రక్తాక్షరాలను లిఖించడంతో పాటు చంద్రబాబు కటౌట్ పాదాలకు రక్తాభిషేకం చేశారు. తనకు విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని, చట్టసభలో చంద్రబాబు వెనుక కూర్చునే అవకాశం తనకు కల్పించాలని కోరారు. విజయవాడ పశ్చిమ లేదంటే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలో జరిగే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో పార్టీ కోసం నిలబడే వారికి ప్రాధాన్యమివ్వాలని, తనకు చంద్రబాబు కుటుంబం తప్ప వేరే నాయకులు లేరని, తన ప్రాణ సమానమైన చంద్రబాబు కోసం తన గుండె కోసి ఇవ్వమన్నా సిద్ధమని తెలిపారు.
తనకు టికెట్ ఇవ్వక పోయినా ‘సీబీఎన్ జిందాబాద్’ అనే అంటానని, తాను కొడాలి నాని, వంశీ, కేశినేని నాని తరహా నాయకుడిని కాదని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబుతోనే తన ప్రయాణమని పేర్కొన్నారు.
టిక్కెట్ కోసం తిప్పలు….
విజయవాడ పశ్చిమ టిక్కెట్‌ను జనసేన అభ్యర్ధికి కేటాయిస్తారనే ప్రచారంతో బుద్దా వెంకన్న తన సొంత సామాజిక వర్గం అధికంగా ఉండే అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. అయితే అనకాపల్లి లోక్‌సభ టిక్కెట్ తన కుమారుడికి ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు గట్టిగా పట్టుబడుతున్నారు.
బుద్దా వెంకన్నను విజయవాడ నుంచి అనకాపల్లి రానిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పర్యటనకు బుద్దా వెంకన్న వస్తే తాము వచ్చే ది లేదని తేల్చి చెప్పి పంతం నెగ్గించుకున్నారు.
ఇటు విజయవాడ అసెంబ్లీ టిక్కెట్, అటు అనకాపల్లి లోక్‌సభ టిక్కెట్ రెండు దక్కే పరిస్థితులు లేకపోవడంతో బుద్దా వెంకన్న చంద్రబాబును ప్రసన్నం చేసుకోడానికి తిప్పలు పడుతున్నారు. బాబు కరుణించి తనకు ఏదొక చోట పోటీ చేసే అవకాశం కల్పించక పోతారి అని నడిరోడ్డుపై రక్తంతో కటౌట్‌కు అభిషేకం వంటి కాన్సెప్ట్‌లకు ప్లాన్ చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.