TDP Rajyasabha Elections: ఏపీలో రాజ్యసభ బరి నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా? మౌనం వీడని చంద్రబాబు…
TDP Rajyasabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని పోటీకి దింపుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. మూడు స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తుండటంతో టీడీపీ విరమించుకున్నట్టేనని ప్రచారం జరుగుతోంది.
TDP Rajyasabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ విరమించుకున్నట్టు కనిపిస్తోంది. నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు సమీపిస్తున్నా ఆ పార్టీ మాత్రం నింపాదిగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోడానికి తగినంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో పాటు అభ్యర్ధిని నిలిపినా గెలుపు భరోసా లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వైసీపీ తరపున ముగ్గురు అభ‌్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ నామినేషన్ పత్రాలను టీడీపీ కొనుగోలు చేసినా ఇంతవరకు అభ్యర్థి ఎవరనేది మాత్రం సస్పెన్స్ వీడలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్టే అని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు. ఆయన పదవీ కాలం కూడా త్వరలో ముగియనుంది. ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోతుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఈ తరహా పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సి వస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఆ తర్వాత నలుగురు సభ్యులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. మరోవైపు వైసీపీ నాయకత్వంతో తలెత్తిన విభేదాలతో నలుగురు సభ్యులు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్ల విచారణ జరుగుతోంది. టీడీపీ శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు రాజీనామాను కొద్ది రోజుల క్రితం స్పీకర్ అమోదించారు. దీంతో టీడీపీ బలం 18కు పడిపోతుంది.
ఇటీవల సీట్ల సర్దుబాటు, టిక్కెట్ల కేటాయింపుల్లో 30మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించలేదు. వారంతా టీడీపీకి మద్దతు ఇస్తారని ప్రచారం జరిగింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతుతో టీడీపీ రాజ్యసభను గెలుచుకోవడం సులువని భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ తరహా ప్రయోగాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయనే అనుమానం కూడా టీడీపీలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకోవచ్చని భావించినా అది ఎంత మేరకు సాధ్యమనే అనుమానాలు కూడా లేకపోలేదు.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 20గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికల నిర్వహిస్తారు. ఫిబ్రవరి 29లోగా ఎన్నికలు నిర్వహిస్తారు. వైసీపీ అభ్యర్థులు మినహా ఇంకెవరు నామినేషన్లు దాకలు చేయకపోతే ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నామినేషన్లు దాఖలు చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నాయకుల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఒత్తిడి ఉన్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం వాటికి తలొగ్గడం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యే కంటే దూరంగా ఉండటం మంచిదని వారిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను దక్కించుకుంటే మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టడం పెద్ద విషయం కాదని నచ్చ చెబుతున్నట్టు తెలుస్తోంది.