ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల తేదీ ఖరారు
50 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, మరో ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది.
దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. పార్లమెంటు ఎగువ సభ సభ్యత్వానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఉత్తరప్రదేశ్ (10), మహారాష్ట్ర (6), బీహార్ (6), పశ్చిమ బెంగాల్ (5), మధ్యప్రదేశ్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తెలంగాణ (3), రాజస్థాన్ (3), ఒడిశా (3), ఉత్తరాఖండ్ (1), ఛత్తీస్గఢ్ (1), హర్యానా (1), హిమాచల్ ప్రదేశ్ నుంచి (1) స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభ అనేది పార్లమెంటు యొక్క శాశ్వత సభ. దీనిలో సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. రాజ్యసభ నిరంతర కార్యకలాపాల కొనసాగింపునకు ఇది సహాయపడుతుంది.
50 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, మిగిలిన ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది.
2024 రాజ్యసభ ఎన్నికల పూర్తి షెడ్యూల్
నోటిఫికేషన్ | ఫిబ్రవరి 8 |
నామినేషన్లకు చివరి తేదీ | ఫిబ్రవరి 15 |
నామినేషన్ల పరిశీలన | ఫిబ్రవరి 16 |
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు | ఫిబ్రవరి 20 |
ఎన్నికల తేదీ | ఫిబ్రవరి 27 |
ఎన్నికల సమయం | 9am - 4pm |
ఓట్ల లెక్కింపు | ఫిబ్రవరి 27, 5pm |
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేందుకు గడువు | ఫిబ్రవరి 29 |
ప్రస్తుత రాజ్యసభలో మొత్తం 238 మంది సభ్యులు ఉండగా, బీజేపీ అత్యధికంగా 93, కాంగ్రెస్ 30, తృణమూల్ కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ 10, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలకు 10 స్థానాలు ఉన్నాయి.
అంతేకాక కళలు, సాహిత్యం, శాస్త్రాలు మరియు సామాజిక సేవలకు చేసిన కృషికి గాను రాష్ట్రపతి 12 మంది సభ్యులను ఎగువ సభకు నామినేట్ చేస్తారు.
ప్రజాస్వామ్యం యొక్క పార్లమెంటరీ రూపంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుంది. దీనినే 'పెద్దల సభ'గా వ్యవహరిస్తారు.