Ysrcp Rajyasabha: వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది.
రాజ్యసభలో ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలను దక్కించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వేమిరెడ్డి పభాకర్ రెడ్డి, సిఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ఏప్రిల్ 3వ తేదీతో పూర్తి కానుంది. సిఎం రమేష్ టీడీపీ నుంచి ఎన్నికైనా.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. టీడీపీ తరపున కనకమేడల ఉన్నారు.
రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మూడు స్థానాలను దక్కించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో నలుగురు ప్రస్తుతం ఆ పార్టీని వీడారు. మరోవైపు టీడీపీ నుంచి గెలిచిన వారిలో కూడా కొందరు వైసీపీ వైపు వచ్చారు. ఈ నేపథ్యంలో మూడు స్థానాలను వైసీపీ దక్కించు కోవడంపై అనుమానాలు ఉన్నాయి.
రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు లోక్‌సభకు పోటీ చేయించాలని నిర్ణయించారు. పోటీకి తొలుత నిరాకరించినా తర్వాత మెత్తబడ్డారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉన్న బలం దృష్ట్యా జగన్ బాబాయి, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించారు. సుబ్బారెడ్డి గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్‌లోకి తీసుకోవాలని కోరినా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించలేదు. రెండుసార్లు టీటీడీ ఛైర్మన్ పదవికి పరిమితం చేశారు. తాజాగా సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. మరో స్థానానికి పాయకారావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును ఎంపిక చేశారు.
సామాజిక సమీకరణల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోడానికి ఈ ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మూడో స్థానానికి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్లను ఖరారు చేశారు. మూడు రాజ్యసభ స్థానాలను వైసీపీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిథ్యం లేకుండా పోయే ప్రమాదం ఉండటంతో ఒక్క స్థానాన్నైనా దక్కించుకోవాలని భావిస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు. sa