Ganta Srinivasa Rao Resigns : టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. గంటా రాజీనామాను ఈ నెల 22న స్పీకర్ ఆమోదించినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 12న రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ విషయంపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని 2022లో గంటా మరోసారి స్పీకర్‌కు లేఖ రాశారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ అలర్ట్ అయ్యింది. రాజ్యసభ ఎన్నికల సమయానికి తమ సంఖ్యా బలం తగ్గించాలనేది వ్యూహంలో భాగంగా వైసీపీ ఎత్తుగడ అని టీడీపీ ఆరోపించింది. పార్టీ మారిన నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపైనా వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తుంది.
రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీలో ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయి. ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీకానున్నాయి. త్వరలోనే ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వైసీపీ హైకమాండ్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకని రాజ్యసభ సీట్లు చేజారకుండా వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యూహత్మక పరిణామాల మధ్య రెండేళ్ల కిందట ఎమ్మెల్యే పదవికి గంటా చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. సీట్లు మార్చిన ఎమ్మెల్యేల అసంతృప్తి నేపథ్యంలో వైసీపీ ముందే జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాల చేదు అనుభవంతో వైసీపీ ముందే మేల్కొందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ వ్యూహంతో అలర్ట్ అయిన టీడీపీ కౌంటర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తామిచ్చిన డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ల ఆమోదం విషయంలో స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని భావిస్తుంది. రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై టీడీపీ డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరుతుంది.
స్పీకర్ నిర్ణయంపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా, ఇప్పుడు ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనతో సీఎం జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని స్పీకర్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే తన రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. స్పీకర్‌ను కలిసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు, ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఆమోదించడమేంటని గంటా ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం సీఎం జగన్ లో కనిపిస్తోందని విమర్శించారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారని సీఎం జగన్‌కు అనుమానంగా ఉన్నట్టుందన్నారు.