Budda Venkanna On kesineni: బీసీని కాబట్టే టార్గెట్ చేశారంటున్న బుద్దా వెంకన్న
Budda Venkanna On kesineni: బెజవాడ టీడీపీలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట కొనసాగుతోంది. టీడీపీలో తన ప్రత్యర్థులను ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని గొట్టంగాళ్లు అని వ్యాఖ్యానించడంపై మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
Budda Venkanna On kesineni: బీసీని కాబట్టి విజయవాడ ఎంపీ కేశినేని నాని తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నాడని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ఆరోపించారు. కేశినేనిపై గతంలో తాను అనుచితంగా మాట్లాడినందుకు తాను విచారం వ్యక్తం చేశానని, ఆవేశంలో అప్పట్లో అలా మాట్లాడినందుకు చింతిస్తున్నానని అప్పుడే ప్రకటించానని గుర్తుచేశారు. కేశినేని నానితో తాను కూడా కలిసి పనిచేశానని వ్యక్తిగత విభేదాల కారణంగానే తాను ఆయనకు దూరమైనట్లు చెప్పారు.
పార్టీలో ఎవరికి భయపడే ప్రసక్తి లేదని, కేశినేని నాని తనను ఎన్ని సార్లు అవమానించినా భరించానని చెప్పారు. కేశినేని నానితో భేదాభిప్రాయాలు ఉన్న మాట నిజమేనని, గతంలో తామంతా కలిసి పనిచేశామన్నారు. కేశినేని నాని టార్గెట్ చేసినట్లు ఇతర నేతల్ని అవమానిస్తున్నా ఆయన విజ్ఞతకు విడిచిపెడుతున్నట్లు చెప్పారు.
చంద్రబాబుకు మాత్రమే టీడీపీలో తాము లోబడి ఉంటామని బుద్దా వెంకన్న చెప్పారు. గతంలో కేశినేని నానికి వ్యతిరేకంగా ఆవేశంలో మాట్లాడితే చంద్రబాబు అందరిని గదమాయించారని స్పష్టంచేశారు. దాంతో తాను ఇకపై ఎవరికి వ్యతరేకంగా మాట్లాడనని మాటిచ్చానన్నారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడినందుకు చంద్రబాబు తమను గతంలోనే మందలించారని, ఇకపై ఎవరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయనని చంద్రబాబుకు మాటిచ్చానని చెప్పారు. కేశినేని నాని మాత్రం అందరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీలో తనకు వ్యతిరేకంగా కొంతమంది బెజవాడ నాయకులు జట్టు కడుతున్నారనే ప్రచారంతో కేశినేని నాని రగిలిపోతున్నారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, కేశినేని చిన్ని వంటి వారు ఎంపీ నానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
బెజవాడ పార్లమెంటు స్థానం నుంచి తనను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండటంపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానానికి సైతం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు ఆగ్రహం కలిగితే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా అని ఝలక్ ఇస్తున్నారు. మంచి పనులు చేస్తున్నందునే ఇతర పార్టీల నుంచి ఆహ్వానం లభించిందని ఎంపీ నాని చెబుతున్నారు.