తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Arogyasri: నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల బంద్

AP Arogyasri: నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల బంద్

Sarath chandra.B HT Telugu

25 January 2024, 9:22 IST

google News
    • AP Arogyasri: ఆంధ్రప్రదేశ‌‌లో జనవరి 25 నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేయాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిర్ణయించాయి. ప్రభుత్వం హామీ ఇచ్చి నెలరోజులైనా నిధులు విడుదల కాకపోవడంతో సేవల్ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. 
ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని  ఆస్పత్రుల హెచ్చరికల
ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రుల హెచ్చరికల

ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రుల హెచ్చరికల

AP Arogyasri: ఏపీలో నేటి నుంచి నెట్‌వర్క్‌ ఆస్పత్రల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. బుధవారం రాత్రి ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్య సంఘం సమాచారం ఇచ్చింది. డిసెంబర్‌ నెలలో నోటీసులు ఇచ్చి 29వ తేదీ నుంచి సేవలు నిలిపి వేస్తామని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలిచింది, బకాయిలు చెల్లిస్తామనే హామీతో డిసెంబర్ 25న ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు 1200 కోట్ల రూపాయల వరకూ బిల్లులు పెండింగులో ఉన్నాయి. దీంతో పాటు పదేళ్ల క్రితం నిర్ణయించిన ప్యాకేజీలతోనే చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్సల ఛార్జ్‌లు పెంచాలని ఎప్పటి నుంచో ఆస్పత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆస్పత్రుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఈ నెల 29 నుంచి సేవలు నిలిపివేస్తామని లేఖ రాశాయి. గత నెలలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీ ఆస్పత్రులకు లభించలేదు. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపి వేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులకు సేవలు కొనసాగించి, కొత్త రోగులను నేటి నుంచి అడ్మిట్ చేసుకోకూడదని నిర్ణయించాయి.

గత మూడు నెలల్లో రెండు సార్లు ఆస్పత్రలు యాజమాన్యాలు ప్రభుత్వానికి డెడ్‌ లైన్‌ విధించినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గాయి. తాజాగా జనవరి 25 నుంచి సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలతో పాటు ఉద్యోగులకు సేవలు అందించే ఈహెచ్‌ఎస్‌ నిలిపి వేస్తున్నట్లుప్రకటించారు. ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు చెల్లించకుండా రోగులకు వైద్య సేవలు అందించడం సాధ్యం కాదని ఆస్పత్రలు చెబుతున్నాయి.

ఆరోగ్య శ్రీ సేవల నిలిపి వేస్తున్నట్లు ఆస్పత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.1200కోట్ల రుపాయల వరకు బిల్లుల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. డిసెంబర్ 25 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించారు.

తదుపరి వ్యాసం