CM Jagan : ఆరోగ్య శ్రీలో రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఇది చారిత్రక నిర్ణయం-సీఎం జగన్-amaravati news in telugu cm jagan review on ysr aarogyasri limit hike rs 25 lakh starts on december 18th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : ఆరోగ్య శ్రీలో రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఇది చారిత్రక నిర్ణయం-సీఎం జగన్

CM Jagan : ఆరోగ్య శ్రీలో రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స, ఇది చారిత్రక నిర్ణయం-సీఎం జగన్

Bandaru Satyaprasad HT Telugu
Dec 13, 2023 04:55 PM IST

CM Jagan : వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పరిమితిని ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షలకు పెంచింది. ఈ కార్యక్రమానికి డిసెంబర్ 18న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆరోగ్య శ్రీ అమలుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

సీఎం జగన్ సమీక్ష
సీఎం జగన్ సమీక్ష

CM Jagan : ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమం డిసెంబర్‌ 18న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ...ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. విద్య, ఆరోగ్యం ప్రజలకు ఒక హక్కుగా లభించాలన్నారు. పేద ప్రజలకు ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందన్న భరోసా ఇవ్వాలన్నారు. వైసీపీ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందడుగు వేస్తోందన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకు వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు.

ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ

ఈ నెల 19 నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆరోగ్య శ్రీ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతోందన్నారు. జనవరి నెలాఖరు నాటికి ఈ కార్యక్రమం పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారు మళ్లీ చెకప్‌ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌ లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 జనవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించాలన్నారు.

రేపు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం

ఉద్దానంలో కిడ్నీ బాధితులకు అందుతున్న వైద్య చికిత్సలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. స్క్రీనింగ్, మందులు, చికిత్స ఇలా కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలన్నారు. డయాలసిస్‌ పేషెంట్లు వాడుతున్న మందులు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్‌ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, కంచిలి మండలం మకరాంపురం వద్ద వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్‌ను సీఎం జగన్ గురువారం ప్రారంభించనున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. అత్యాధునిక హంగులతో ఆసుపత్రితో పాటు రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

Whats_app_banner

సంబంధిత కథనం