Jagananna Arogyra Suraksha: ఏపీలో ఆరోగ్య సురక్ష క్యాంపులతో వైద్యంపై భరోసా
Jagananna Arogyra Suraksha: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వేగం పెంచింది. పేద ప్రజలు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు.
Jagananna Arogyra Suraksha: 53 రకాల వైద్య పరీక్షలు.. 172 రకాల మందులు అదీ ఉచితంగా అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు యజ్ఞంలా సాగుతున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రక్త పరీక్షలు మొదలుకుని స్పెషలిస్ట్ డాక్టర్ల కన్సల్టేషన్, మందుల పంపిణీ వరకు ప్రత్యేక యంత్రాంగంతో ఉచితంగా అందించే ఆరోగ్య సురక్ష క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో డీఎంహెచ్ వోల పర్యవేక్షణలో ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జగనన్న క్యాంపుల్లో అత్యధికంగా బ్లడ్ టెస్టులు, మందుల పంపిణీ, ఆపరేషన్లు, దీర్ఘకాలిక చికిత్స అవసరమైన రోగులను మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేస్తున్నారు. ప్రతి క్యాంపులో ఏకంగా నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనుంది.
ప్రధానంగా కంటి సంబంధిత సమస్యలు, పోషకాహార లోపాలు, టీబీ, లెప్రసీ, అనిమియా లోపం, గర్భిణీలు, చిన్నపిల్లల్లో సరైన ఎదుగుదల లేని వారిని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా గుర్తించి వారికి నాణ్యమైన, మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది.
దీని కోసం ఉన్నత స్థాయి ప్రభుత్వ, ఆరోగ్య శ్రీ కింద కవర్ అవుతున్న మల్టిస్పెషాలిటీ ఆసుప్రతులకు రిఫర్ చేస్తోంది. తీవ్ర వైద్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి సత్వర వైద్యం అందనుంది. సాధారణ వ్యాధులకు సంబంధించి టెస్టులు, మందుల పంపిణీ చేస్తుండటంతో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
మల్టిస్పెషాలిటీ తరహాలో వైద్య సేవలు
రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ ప్రకటించారు. సిఎం జగన్ చెప్పిన విధంగా ప్రస్తుతం ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను వైద్య ఆరోగ్య శాఖ పకడ్బంధీగా నిర్వహిస్తోంది. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహాలో స్పెషలిస్టు వైద్యులు ఆరోగ్య శిబిరంలో అందుబాటులో ఉంటున్నారు.
వైద్య శిబిరాలకు వృద్దులు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు క్యాంపులను సందర్శించి వైద్య సేవలు పొందుతున్నారు. గతంలో ఏనాడూ ప్రభుత్వ ఆధ్వర్వంలో ఇంత భారీ స్థాయిలో మెడికల్ క్యాంపులు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో పాటు ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో టెస్టులు, ఈసీజీ, కాటరాక్ట్ పరీక్షలు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ప్రైవేట్ ఓపీ కంటే వేగంగా..
గంటలో పరీక్షలు, స్పాట్ లో మందుల పంపిణీ…
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో మల్టి స్పెషాలిటీ తరహా పద్దతిలో వైద్య సేవలు అందిస్తున్నారు.నలుగురు స్పెషలిస్ట్ లు అందుబాటులో ఉండటంతో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతకు ముందే ఏఎన్‌ఎమ్ ల ద్వారా 7 రకాలు వైద్య పరీక్షలు పూర్తి చేసిన రికార్డులు ముందు ఉంచుకుని ప్రత్యేక టెస్ట్ లకు రెఫర్ చేస్తున్నారు. క్యాంపులోనే ల్యాబ్ టెక్నీషియన్ లు అందుబాటులో ఉండటంతో గంటలోపే పరీక్షలు పూర్తి అవుతున్నాయి.
అనంతరం వెంటనే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు సిబ్బంది మందులు పంపిణీ చేస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో దాదాపు రక్తపరీక్షలతోపాటు వివిధ రోగాలను గుర్తించేలా సుమారు 53 రకాల పరీక్షలు చేస్తున్నారు. దీంతోపాటు 172 రకాల మందులను క్యాంపుల వద్ద ఇస్తున్నారు. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 350 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పీహెచ్‌సీ పరిధిలోని వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది క్యాంపు వద్ద ఉంటున్నారు.
క్యాంపుల్లో 18 రకాల శస్త్రచికిత్స, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ప్రజలకు మురుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఆరోగ్య శిబిరంలో 18 రకాల శస్త్రచికిత్స వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. శిబిరంలో పాల్గొన్న వారికి అవసరమైన చికిత్సలు చేయడంతోపాటు, మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంటే అలాంటి వారిని ఆరోగ్య శ్రీ కింద పనిచేస్తున్న ఆసుపత్రులకు ఆ రోగులను వైద్యులు పంపుతున్నారు. ఇలా ప్రతి ఒక్కటీ సమకూర్చడంతో ఆరోగ్య సురక్ష శిబిరాలకు స్పందన లభిస్తోంది.
ప్రత్యేకంగా టీబీ, లెప్రసీ టెస్టులు..
మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రతిరోజూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహిస్తున్నారు. శిబిరానికి వచ్చే ప్రజలకు పరీక్షలు చేసేందుకు రోజూ ఒక్కో శిబిరంలో నలుగురు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఇందులో ప్రాణాంతక వ్యాధులైన టీబీ, లెప్రసీ టెస్టులు ప్రత్యేకంగా త్వరితగతిన చేపడుతున్నారు.
రోగ లక్షణాలు కనిపిస్తే అప్పటికప్పుడే ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నారు. కోర్సు మొత్తానికి కావాల్సిన మందులు ఇస్తూ.. లేదా ఆశా కార్యకర్తల జాబితాలో సంబంధిత రోగిని రిజిస్టర్ చేసి సకాలంలో మందులు అందిస్తున్నారు. క్యాంపు తర్వాత కూడా వారికి మందులు, ఇతర ట్రీట్ మెంట్ ఇచ్చేలా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు పాల్గొనడంతో అవసరమైన చికిత్స కొనసాగింపుకు భరోసా అందిస్తున్నారు.
ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపింది. ఇక ఆరోగ్య సురక్ష క్యాంపులను విజయవంతం చేసేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఉచితంగా నెల రోజులకు అవసరమయ్యే మందులు
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను సందర్శించిన తరువాత రోగులకు నెల రోజులకు అవసరమైన మందులను వైద్యులు అందిస్తున్నారు. ఆ తరువాత చికిత్సకు అవసరమైన మందులు కొనసాగించాలంటే స్థానిక పీహెచ్ సీ లేదా ఆశా కార్యకర్తల ద్వారా ఉచిత మందులు అందించే ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా వైద్య శిబిరాల్లో జనరల్ మెడిసిన్ ఇచ్చే వైద్యులు ఎక్కువ మంది ఉంటారని కానీ జగనన్న ఆరోగ్య సురక్షలో స్పెషలిస్టు వైద్యులు నలుగురు వరకు ఉంటున్నారు.
వీరిలో ఆర్థో, గుండె, చిన్నపిల్లలు, గైనకాలజీ విభాగానికి చెందిన వైద్యులు ఎక్కువ మంది పాల్గొంటున్నారు. శిబిరానికి వస్తున్న ప్రజలకు క్యాంపుల వద్దే భోజనం, మంచి నీరు కూడా అందిస్తున్నారు. దీంతోపాటు రోగులకు సాయం చేసేందుకు వాలంటీర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటంతో జగనన్న ఆరోగ్య శిబిరాలు మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తున్నాయి.