AP Arogyasri: ఏపీలో ఆరోగ్యశ్రీ ఆపేస్తామని ఆస్పత్రుల సంఘం వార్నింగ్
AP Arogyasri: ఏపీలో ఆరోగ్య శ్రీ చికిత్సలను నిలిపివేస్తామని ఆస్పత్రుల సంఘం ఆశా ప్రకటించింది. బకాయిల చెల్లింపు, చికిత్సల టారిఫ్ పెంపు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆస్పత్రులు తప్పు పడుతున్నాయి.
AP Arogyasri: ఏపీలో డిసెంబర్ 29 నుంచి 'ఆరోగ్యశ్రీ' సేవలు నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. ఆరోగ్య శ్రీ చికిత్సల ఫీజుల చెల్లింపులో తీవ్ర జాప్యం, పదేళ్లుగా ప్యాకేజీ ధరలు పెంచక పోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్య శ్రీ పథకంలో రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లుగా ఫీజుల చెల్లింపుల్లో జాప్యంపై కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బకాయిల విడుదలపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాలను గతంలో వాయిదా వేశారు. చికిత్సలకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కొత్త కేసులను అడ్మిట్ చేసుకోమని ఆస్పత్రుల సంఘం ప్రకటించింది.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆస్పత్రుల సంఘం ఆరోపించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఈహెచ్‌ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది జూన్, నవంబరు మాసాల్లో సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన తరవాత చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ప్రభుత్వ భరోసాతో రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయని గుర్తు చేశారు. గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి డిసెంబర 22న లేఖను పంపినట్టు తెలిపారు.
ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం రూ.1,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంతో నవంబరులో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబరు నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని చెబుతుననారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నిర్ణయించిన ప్యాకేజీ ధరలను ఆ తర్వాత పెంచలేదని, టారిఫ్ పెంపు కోసం అసోసియేషన్ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని చెబుతున్నారు. కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా రూ.25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచిందని చెబుతున్నారు.
ఆయుష్మాన్ భారత్ కింద నిర్ణయించిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10శాతం వరకు తగ్గించారని, 70శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదని, కొన్ని ప్యాకేజీల ధరల పెంపు 2.5 శాతం మేర పెరిగిందని చెబుతున్నారు. ప్రభుత్వ చర్యలతో ఆసుపత్రులకు ఆర్థికంగా జరిగిన ప్రయోజనం శూన్యమని ఈ పరిస్థితుల్లో వైద్య సేవల నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయాలని గత నెలలోనే నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం చర్చలు జరిపి.. నెట్‌వర్క్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 15 నాటికి ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదని ఆస్పత్రుల బకాయిల విడుదలలో కూడా తాత్సారం చేస్తున్నారని సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరసన కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు.