AP Arogyasri Dues: ఆరోగ్య శ్రీ నిలిపేస్తున్నామన్న ఆస్పత్రులు..బకాయిలు విడుదల చేసినప్రభుత్వం-hospitals that are stopping the services of arogya shri government has released the dues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Arogyasri Dues: ఆరోగ్య శ్రీ నిలిపేస్తున్నామన్న ఆస్పత్రులు..బకాయిలు విడుదల చేసినప్రభుత్వం

AP Arogyasri Dues: ఆరోగ్య శ్రీ నిలిపేస్తున్నామన్న ఆస్పత్రులు..బకాయిలు విడుదల చేసినప్రభుత్వం

HT Telugu Desk HT Telugu
May 19, 2023 06:36 AM IST

AP Arogyasri Dues: బకాయిలు భారీగా పేరుకు పోవడంతో ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పటల్స్‌ అసోసియేషన్- ఆశా ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపి వేస్తున్నామనే ప్రకటనతో కలకలం రేగింది. ప్రభుత్వం ఆగమేఘాలపై పాక్షికంగా నిధులు విడుదల చేసి ఆస్పత్రుల్ని బుజ్జగించింది.

ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని  ఆస్పత్రుల హెచ్చరికల
ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రుల హెచ్చరికల

AP Arogyasri Dues: శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగక్య శ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించడంతో కలకలం రేగింది. దీంతో ఆస్పత్రుల ప్రతినిధులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ అత్యవసరంగా సమావేశం అయ్యారు. అప్పటికప్పుడు ప్రభుత్వం రూ368 కోట్ల రుపాయల నిధులను విడుదల చేయడంతో వ్యవహారం సద్దుమణిగింది.

పెండింగు బకాయిలను చెల్లించకపోతే శుక్రవారం నుంచి రోగులకు వైద్యసేవలు నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాల్టీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు సుమారు రూ.1,500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో ఆస్పత్రులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, సమస్యలతో ఆసుపత్రులను ఎలా నడపగలగమని ప్రశ్నించింది.

ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ కార్డు కలిగినవారికి అందించిన సేవలకు సంబంధించి గత జులై/ఆగస్టు నుంచి బిల్లులు పెండింగులో ఉన్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. వాటిలో 10% మాత్రమే విడుదల చేస్తే ఎలాగని మండిపడింది. దీంతో గురువారం సాయంత్రం అత్యవసరంగా జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధీరప్రసాద్‌ ఆంధ్ర ప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పటల్స్‌ ప్రతినిధులతో మాట్లాడారు.

అప్పటికప్పుడు 'రూ.368 కోట్ల రుపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రెండు వారాల్లోగా మరో రూ.550 కోట్లు విడుదలవుతాయని, రోగులకు ఆరోగ్య సేవలు కొనసాగించాలని కోరారు. బకాయిల చెల్లింపుల కోసం చర్యలు తీసుకోకుంటే తమ భవిష్య కార్యాచరణ ప్రకటించక తప్పదని ఆశా ప్రతినిధులు వెల్లడించారు. పాక్షికంగా నిధుల చెల్లింపుతో ఆస్పత్రులు ఆందోళన విరమించాయి.

ప్రైవేట్ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ట్రస్టు సీఈఓ హరేంధీర ప్రసాద్‌ వెల్లడించారు. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం చేతగాని ప్రభుత్వం పేదల పక్షమా?

వైసీపీ పాలకుల అసమర్థ ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయని జనసేన ఆరోపించించింది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం చేసే నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు బకాయి పడిందని, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల నిర్వాహకులు అనేకమార్లు ప్రభుత్వాన్ని కోరినా సరిగా స్పందించ లేదని ఆరోపించారు. అరకొరగా నిధులు ఇచ్చి పేదలకు వైద్యం చేయిస్తున్నాం అని మభ్యపెట్టే ప్రయత్నాలే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయన్నారు.

బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు కొనసాగించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు గత నెలలోనే తేల్చి చెప్పినా ప్రభుత్వం స్పందించలేదని పేదల పక్షం ఉన్నామని గొప్పలు చెప్పుకొనే వ్యక్తి పాలన ఇదేనని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అని తెలుసుకోవాలన్నారు.ముఖ్యమంత్రికి నిజంగా పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి నిధులు ఇచ్చి, ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోకుండా చూసేవారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతూ అదే పాలన అనుకొనే ముఖ్యమంత్రి ముందుగా ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner