తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Corporation: చెత్త వేసేది వాళ్లే.. కబుర్లు చెప్పేది వాళ్లే.. విఎంసి తీరే అంత!

Vijayawada Corporation: చెత్త వేసేది వాళ్లే.. కబుర్లు చెప్పేది వాళ్లే.. విఎంసి తీరే అంత!

HT Telugu Desk HT Telugu

05 June 2023, 9:24 IST

    • Vijayawada Corporation: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తీరు చూసిన వారు ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. స్వచ్ఛమైన నదీ జలాలతో పరుగులు తీయాల్సిన పంట కాల్వల్లో, డ్రెయిన్లను నేరుగా కలిపే కార్పొరేష్ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా క్లీన్ కృష్ణ అంటూ ర్యాలీ నిర్వహించింది.  
మిషన్ క్లీన్ కృష్ణా పేరుతో నగరంలో కార్పొరేషన్ ర్యాలీ
మిషన్ క్లీన్ కృష్ణా పేరుతో నగరంలో కార్పొరేషన్ ర్యాలీ

మిషన్ క్లీన్ కృష్ణా పేరుతో నగరంలో కార్పొరేషన్ ర్యాలీ

Vijayawada Corporation: వందల కిలోమీటర్లు స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో పరుగులు తీసే కృష్ణానది విజయవాడ నగరానికి వచ్చే సరికి మురికి కాల్వగా మారిపోతుంది. మూడు రాష్ట్రాలు దాటి బిరబిర పరుగులు తీసే నదికి విజయవాడ వచ్చే సరికి మకిలి పడుతుంది. నాలుగైదు జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించే కాల్వలు కాస్త మురికి కూపంగా మారిపోతాయి.

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్ కాల్వలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ మొదలుకుని కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లా వరకు ఈ కాల్వ ద్వారా సాగు, తాగు నీరు సరఫరా అవుతుంది.

విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీరు విడుదల అవుతుంది. కృష్ణాతూర్పు డెల్టా పరిధిలో ఏలూరుకాల్వ, బందరు కాల్వ, రైవస్ కాల్వలు వందల కిలోమీటర్ల దూరం సాగుతుంటాయి. కృష్ణాడెల్టా ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసే డెల్టా కాల్వల్లో ఒకప్పుడు సరకు రవాణా కూడా జరిగేది. ఏడాది లో పదినెలల పాటు కాల్వల మీదుగా పడవల్లో రవాణా సాగేది. ప్రస్తుతం డెల్టా కాల్వలన్ని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వాకంతో మురికి కాల్వలుగా మారిపోయాయి.

నగరం మొత్తం కాల్వ గట్ల మీద అక్రమణలు వెలియడం, వాటి నుంచి వచ్చే మురుగు మొత్తం కాల్వల్లో కలిపేయడం మొదలైంది. దీనికితోడు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినా మురుగు నీటిని ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే ఔట్ ఫాల్ డ్రెయిన్లను నేరుగా పంట కాల్వల్లోకి, కృష్ణా నదిలోకి కార్పొరేషన్ కలిపేస్తోంది.

2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి విజయవాడ మకాం మార్చిన తర్వాత కాల్వల్లో ట్రీట్మెంట్ చేయకుండా మురుగు నీటిని కలపకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురుగు నీటికి దిగువ జిల్లాల్లో తాగునీటిగా వినియోగిస్తుండటం, వందలాది గ్రామాలకు సరఫరా అయ్యే కృష్ణాజలాల్లో హానికారక వ్యర్థాలను కలపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రూ.750కోట్లతో కృష్ణానది నుంచి పైప్ లైన్ల ద్వారా గ్రామాలకు నేరుగామంచినీటిని సరఫరా చేయాలని ప్రతిపాదించినా అది కాగితాలకు పరిమితం అయ్యింది.

పదేళ్ల తర్వాత కూడా ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే విజయవాడ కార్పొరేషన్ డ్రైనేజీ నీటిని కృష్ణా కాల్వల్లో కలుపుతూనే ఉంది.తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్నిపురస్కరించుకుని కాల్వల్ని శుభ్రంగా ఉంచాలంటూ విజయవాడ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్‌తో పాటు ప్రజాప్రతినిధులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. నగరంలో కాల్వల్ని శుభ్రంగా ఉంచాలని, ప్రజలు కాల్వల్లో చెత్తా చెదారం వేయొద్దని సూచించారు.

నిజానికి నగరంలోని కాల్వల్లో వేసే చెత్తలో అధిక భాగం ఔట్ ఫాల్ డ్రెయిన్ల నుంచి కొట్టుకువచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలే అధికంగా ఉంటాయి. వీటితో పాటు ప్రజలు కూడా ఇళ్లలో చెత్తా చెదారం తీసుకు వచ్చి కాల్వ గట్ల మీద పాడేయటం అలవాటై పోయింది. వేసవిలో కాల్వలకు నీటి కట్టేసినపుడు కూడా వాటిలో మురుగు ప్రవహిస్తూనే ఉంటుంది. వీటి మీద అధికారుల్ని ప్రశ్నించినా మురుగుశుద్ది గురించి జవాబు చెప్పలేకపోయారు. కమిషనర్‌ను మీడియా ప్రశ్నించినపుడు ట్రీట్మెంట్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నామని, జనంలో కూడా మార్పు రావాలని చెప్పుకొచ్చారు.