తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala Ramakrishna Reddy : పెట్టుబడులు చూసి బాధలో ప్రతిపక్షాలు : సజ్జల

Sajjala Ramakrishna Reddy : పెట్టుబడులు చూసి బాధలో ప్రతిపక్షాలు : సజ్జల

HT Telugu Desk HT Telugu

14 December 2022, 18:54 IST

    • Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ కు వస్తోన్న పెట్టుబడులు చూసి ప్రతిపక్షాలు బాధలో కూరుకుపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు జరిగేలా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. 
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వరదలా రావడంతో.. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గత రెండు రోజుల్లో రాష్ట్రానికి 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, వాటికి క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసిందని చెప్పారు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని అంటున్న విపక్షాలే.. వచ్చిన వాటిని అవి పరిశ్రమలే కాదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

ఏపీకి ఏ పెట్టుబడి వచ్చినా సీఎం జగన్ కు బంధువులని దుష్ప్రచారం చేస్తూ.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని విపక్షాలపై మండిపడ్డారు సజ్జల. రాష్ట్రానికి ఏ పెట్టుబడులు వచ్చినా, అవి ప్రజలకు మేలు చేయాలనే అంశాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందన్నారు. బాబు పరిపాలనలో కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు, నచ్చిన వారికే పరిశ్రమలకు నాడు అనుమతులు ఇచ్చిన వారు నేడు జగన్ ప్రభుత్వం పాటిస్తోన్న పారదర్శక విధానాలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేస్తోందని సజ్జల చెప్పారు. కావాలంటే చంద్రబాబు, ఆయన అనుయాయులు కూడా పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారికీ వెంటనే అనుమతులు జారీ చేస్తామని అన్నారు. సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచామని, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఈ నెల 27 నుంచి పింఛను సొమ్ము అందజేయాలని కేబినెట్ లో నిర్ణయించామని తెలిపారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనడానికి పెరిగిన పింఛన్, లబ్ధిదారుల సంఖ్యే నిదర్శనమన్నారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కడప జిల్లాలో రూ. 9 వేల కోట్ల పెట్టుబడితో జేఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. చిత్తూరు డెయిరీని అమూల్ సంస్థకు 99 ఏళ్లకు లీజుకి ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో 5050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలపై స్పందించిన తెలుగుదేశం.. టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో ఏకపక్షంగా లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎలా కట్టబెడతారని ప్రశ్నించింది. బంధుత్వమే అర్హతగా పరిగణించారని ఆరోపించింది.