AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ
07 May 2024, 16:20 IST
- AP Rains Alert: ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మారింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
ఏపీలో చల్లబడిన వాతావరణం
AP Rains Alert : ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.
అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి...ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు,టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపింది.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు , పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం నెల్లూరు, కోనసీమతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
రానున్న మూడు రోజులు వర్షాలు
ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, యానంలో పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉరుములు మెరుపులతో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీస్తాయని హెచ్చరించింది.
రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపు, ఎల్లుండి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములకో కూడిన మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో ఎండలకు బ్రేక్ పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులుతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మంగళవారం పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ధర్మపురి,పెద్దపల్లి, మంథనిలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షం పడుతోంది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.