AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన
AP Weather Update: ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తోంది.
AP Weather Update: ఉక్కపోత, వడగాలులతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. సోమవారం పగలంతా ఎండలు మండిపోయినా సాయంత్రానికి కాస్త చల్లబడింది. ఆకాశం మేఘావృతమై వాతావరణం శాంతించింది. గత పక్షం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఐఎండి సూచనల ప్రకారం తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ SDMA ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
బుధవారం పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు…
రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
మంగళవారం అల్లూరి సీతరామరాజు 3, కాకినాడ 3, తూర్పుగోదావరి 1, ఏలూరు1, ఎన్టీఆర్ 2, గుంటూరు 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లె, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 45.4°C, కర్నూలు జిల్లా పంచలింగాల, వైయస్సార్ జిల్లా వల్లూరులో 45.1 °C, ప్రకాశం జిల్లా తర్లపాడులో 44.9°C, పల్నాడు జిల్లా రావిపాడులో 44.6°C, నెల్లూరు జిల్లా గోనుపల్లిలో 44.4°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అనంతపురం జిల్లా తరిమెలలో 44.3°C, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో 44.2°డిగ్రీలు అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో 44.1°డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 112 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఎండతీవ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం