తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  President Elections 2022 : ఏపీ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్

President Elections 2022 : ఏపీ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్

HT Telugu Desk HT Telugu

18 July 2022, 11:03 IST

    • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలుత ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్ కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనితా,ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి

16వ రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఏపీ అసెంబ్లీలో పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి ఓటును ముఖ్యమంత్రి జగన ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు వైసీపీ - టీడీపీ మద్దతు ప్రకటించాయి. సభలోని మొత్తం 175 మంది సభ్యుల్లో వైసీపీకి 151, టీడీపీకి 23 మంది ఉన్నారు. ఒక ఓటు జనసేనకు ఉన్నా, ఆ ఓటు సైతం ముర్ముకు మద్దతుగానే పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీలన్ని ఒకే అభ్యర్ధి వైపు మొగ్గు చూపుతున్నాయి.

వైసీపీ కార్యాలయంలో మాక్ పోలింగ్

అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీపీ కార్యాలయంలో తొలుత మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తరువాత సభ్యులు అసెంబ్లీ ఆవరణలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తున్నారు. మంత్రి బుగ్గనతో పాటుగా అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త శ్రీకాంత్ రెడ్డి పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పోలింగ్ లో పొల్గొనేలా ఏర్పాట్లు చేసారు. బ్యాలెట్ మీద పోటీలో ఉన్న యశ్వంత్ సిన్హా, ముర్ము పేర్లలో ఎవరికి మద్దతు ఇస్తారో వారి పేరు ఎదుట ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ మాత్రమే వినియోగించి ఒకటి అంకె వేయాల్సిందిగా సూచించారు.

అసెంబ్లీకి చంద్రబాబు….

చాలా రోజుల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి రానున్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలతో పాటుగా ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. రెండు పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో తీయనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సును ఢిల్లీకి తరలిస్తారు. ఏపీకి చెందిన 175 మంది శాసనసభ్యుల్లో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి కూడా ఓటింగ్ కోసం హైదరాబాద్‌లో వేయనున్నారు.

పోలింగ్ కోసం కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ ఏర్పాట్లను కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్‌ భారతి (ఐఏఎస్‌), ఎన్నికల స్పెషల్‌ ఆఫీసర్‌ సంతోష్‌ అజ్మీరా(ఐఐఎస్‌)లు పర్యవేక్షిస్తున్నారు.

టాపిక్