తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh's Yuvagalam Padayatra Reached Its 90th Day In Panyam Assembly Constituency

Yuvagalam 90th Day: 90వ రోజుకు చేరిన నాారా లోకేష్ యువగళం పాదయాత్ర..

HT Telugu Desk HT Telugu

05 May 2023, 12:48 IST

    • Yuvagalam 90th Day: టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 90వ రోజుకు చేరుకుంది. నంధ్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. శుక్రవారం  పెద్దకొట్టాల నుండి 90వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు.  సాయంత్రం పెదపాడులో  నారా లోకేష్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 
దుక్కి దున్నతున్న టీడీపీ నాయకుడు నారా లోకేష్
దుక్కి దున్నతున్న టీడీపీ నాయకుడు నారా లోకేష్

దుక్కి దున్నతున్న టీడీపీ నాయకుడు నారా లోకేష్

Yuvagalam 90th Day: టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర 90వ రోజుకు చేరింది. నంధ్యాల జిల్లాలోని పాణ్యం నియోజక వర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇప్పటి వరకు 1147.5 కి.మీ. దూరం నడిచారు. పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురం గ్రామస్తులు యువనేత నారా లోకేష్‌ను కలిసి సమస్యలు విన్నవించారు.

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఇంటికి ఒక కుళాయి మాత్రమే ఇస్తున్నారని, ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులను అడ్డగోలుగా బనాయిస్తున్నారని వాపోయారు. గ్రామంలో నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగ లేదని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. కల్తీ విత్తనాలు, పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని మొర పెట్టుకున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ధరలు పెంచడంతో ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని, విద్యార్థులకు ఫీజులు విపరీతంగా పెరిగాయని, అధికారంలోకి వచ్చాక సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామస్తుల విజ్ఞప్తులకు స్పందించిన లోకేష్ రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిర్బంధాలు, బెదిరింపులు, భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయని ఆరోపించారు. రాష్ట్రంలో సైకోపాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారని, అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి, అక్రమంగా ప్రజలను, టిడిపి కార్యకర్తలను వేధించిన పోలీసు అధికారులకు ఉద్వాసన పలుకుతామని హామీ ఇచ్చారు.

వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా కనుమరుగైందని, పంచాయతీల నిధులు రూ.8,600కోట్లను ప్రభుత్వం దారిమళ్లించిందని లోకేష్ ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఇంటింటికీ తాగునీటి కుళాయి ఇస్తామని హామీ ఇచ్చారు. అడ్డగోలుగా పెంచిన పాఠశాల, కళాశాల ఫీజులను క్రమబద్దీకరించి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణరంగానికి పూర్వవైభవం తెస్తామన్నారు.

పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురం నేషనల్ హైవేపై కురుబ సామాజిక వర్గీయులు యువనేత లోకేష్‌కు వినతిపత్రం సమర్పించారు. గొర్రెలను మేపడానికి గ్రామాల్లో 5ఎకరాల బంజరు భూమి కేటాయించాలని కోరారు. ఎండనక, వాననక తిరుగుతూ జీవనం సాగించే కురుబలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని, 75శాతం సబ్సిడీపై గొర్రెల కొనుగోలుకు రుణాలు మంజూరు చేయాలన్నారు. మాదాసి కురువ, మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ల ఇవ్వాలని, పర్ల, కంబళ్లపాడు, సల్కాపురంలో కంబళ్ల తయారుచేసే కురుబలకు కంబళ్ల సొసైటీ ద్వారా ఉన్ని సరఫరా చేసి ఆదుకోవాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల మేపుకోసం గతంలో కేటాయించిన భూములను వైసిపి నేతలు ఆక్రమించారని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలమేపుకు కేటాయిస్తామన్నారు. 22గొర్రెలు యూనిట్ గా సబ్సిడీపై గొర్రెల కొనుగోలుకు రుణాలు ఇస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన జిఓలు, గెజిట్ లు పరిశీలించి మాదాసి కురవ, మాదారి కురవలకు న్యాయం చేస్తామన్నారు. కంబళ్ల తయారీకి ఉన్నిని సరఫరాచేసేందుకు చర్యలు తీసుకుంటాంమని చెప్పారు.