తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Murder Politics Software Engineer Killed Youth Leader Of Ysrcp

Murder Politics In Vja : హత్యకు దారి తీసిన గ్రూపు గొడవలు

HT Telugu Desk HT Telugu

10 October 2022, 7:10 IST

    • Murder Politics In Vja విజయవాడ వైఎస్సార్సీపీలో తలెత్తిన గ్రూపు గొడవలు హత్యకు దారి తీశాయి. ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల  ఏర్పాటు విషయంలో తలెత్తిన ఘర్షణలు చివరకు హత్యకు దారి తీశాయి. ప్రత్యర్ధిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన నిందితులు పోలీసులకు లొంగిపోయారు. నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం.
విజయవాడలో హత్యకు గురైన సురేష్
విజయవాడలో హత్యకు గురైన సురేష్

విజయవాడలో హత్యకు గురైన సురేష్

Murder Politics In Vja హత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బెజవాడలో మళ్లీ పార్టీ గొడవలు ముదిరి హత్యలు చేసే వరకు వెళ్లాయి. విజయవాడ తూర్పు నియోజక వర్గం పరిధిలో వైఎస్సార్సీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కుమారుడికి ఐస్‌ క్రీమ్ కొనివ్వడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని కారుతో ఢీ కొట్టి మట్టుబెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

ఇద్దరి మధ్య మొదలైన నాయకత్వ పోరులో చివరకు ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. విజయవాడలో డివిజన్‌ స్థాయి నాయకుడు ఒకరు అదే డివిజన్‌లోని తమ పార్టీ నాయకుడిని కారుతో ఢీ కొట్టి హతమార్చాడు. విజయవాడ మొగల్రాజపురంలోని క్రీస్తురాజపురానికి చెందిన చౌడేష్‌, దేశీ సురేష్‌ మధ్య రెండేళ్లుగా వివాదాలున్నాయి. సురేష్‌ 5వ డివిజన్‌ వైసీపీ యూత్‌ విభాగం అధ్యక్షుడు కాగా, చౌడేష్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. 2020లో క్రీస్తురాజపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి.

అప్పట్లో చౌడేష్‌పై సురేష్‌ దాడి చేశాడు. కుమారుడి ముందు కొట్టడంతో మనస్తాపానికి గురైన చౌడేష్ పలుమార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయన్ని కాపాడారు. అప్పట్నుంచి సురేష్‌పై పగ పెంచుకున్నాడు.

శనివారం మిత్రులతో కలిసి చౌడేష్ బీరు పార్టీ ఇస్తానంటూ స్నేహితులను తీసుకుని కారులో బయటకు వచ్చాడు. రాత్రి 7గంటల ప్రాంతంలో వారంతా తిరిగి వస్తుండగా సురేష్‌ కనిపించాడు. ‘వాడికి ఝలక్‌ ఇచ్చి భయం అంటే ఏమిటో చూపిస్తా’నని స్నేహితులతో చెప్పిన చౌడేష్‌ వేగంగా కారుతో సురేష్‌ను ఢీ కొట్టి అతడిని ఈడ్చుకుపోయాడు. ఆ తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయాడు. తీవ్రగాయాలైన సురేష్‌ను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మరణించాడు. దీనిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో జరిగిన వ్యక్తిగత గొడవలు, పార్టీ విభేదాలు హత్యకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు. వైకాపా నేత సురేష్‌ను అదే డివిజన్‌కు చెందిన మరోనేత చౌడేష్‌ కారుతో ఢీకొట్టి చంపారని పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇద్దరూ విజయవాడ తూర్పు వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అవినాష్‌ అనుచరులుగా ఉన్నారు.

కుమారుడికి ఐస్‌క్రీమ్‌ తీసుకొచ్చేందుకు క్రీస్తురాజపురంలోని తన ఇంటినుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వైకాపా నాయకుడు కంకణాల చౌడేష్‌ నలుగురు మిత్రులతో కలిసి కారులో చక్కర్లు కొడుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న సురేష్‌ను మద్యం మత్తులో వాహనం నడుపుతున్న చౌడేష్‌ ఢీకొట్టి.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. చుట్టుపక్కల ఉన్న వారు కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. బంధువులు సురేష్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సురేష్‌ మచిలీపట్నం ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేటు డ్రైవరు. నిందితుడు చౌడేష్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఇంటినుంచే పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో పార్టీలో తిరుగుతుంటాడు. 2020లో బ్యానరులో ఫొటోల విషయంలో గొడవ జరగడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనిపై మాచవరం పోలీసుస్టేషనులో అప్పట్లో కేసు నమోదుచేశారు. కేసుపై రాజీకి రావాలని రాజకీయ పెద్దలు సూచించినా చౌడేష్‌ అంగీకరించలేదు. చివరకు హత్య వరకు విషయం వెళ్లింది. ఈ ఘటన నేపథ్యంలో చౌడేష్‌, అతని స్నేహితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారు. మరోవైపు ఉద్రిక్తతల నడుమ మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. హత్యకు గురైన వ్యక్తి, నిందితుడు ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వారు కావడం అధికార పార్టీ వారికి తలనొప్పిగా మారింది.

టాపిక్