AP Inter Results 2024 : బాల్య వివాహం నుంచి బయటపడి, ఇంటర్ లో టాపర్‌గా నిలిచి..! ఈ కర్నూలు విద్యార్థిని స్టోరీ చదవాల్సిందే
13 April 2024, 11:48 IST
- AP Intermediate Results 2024 : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో(AP Inter Results) కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల అనే విద్యార్థిని సత్తా చాటింది. కేజీబీవీలో చదువుతున్న నిర్మల…ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కి గాను 421 మార్కులు సాధించింది.
జి. నిర్మల
AP Intermediate Results 2024: నిర్మల….గతేడాది బాల్య వివాహం నుంచి బయటపడింది. ఇంట్లోని తల్లిదండ్రులు చిన్న వయసులోనే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. కానీ నిర్మల్… తన భవిష్యత్ గురించి మదనపడింది. బాల్య వివాహాం బారి నుంచి బయటపడేందుకు… అధికారులను ఆశ్రయించింది. కేజీబీవీలో బైపీసీ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో(AP Inter Results 2024) టాపర్ గా నిలిచి సత్తా చాటింది.
బాల్య వివాహం నుంచి బయటపడి….
నిర్మలది… కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామం. గతేడాది జరిగిన ఏపీ పదో తరగతి ఫలితాల్లో 537 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కానీ అప్పటికే తమ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన నిరుపేద తల్లిదండ్రులు, ఆమె చదువుకు స్వస్తి పలికాలని భావించారు. నిర్మలకి కూడా పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. చదివించలేమని… పైగా సమీపంలో ఇంటర్ కాలేజీ కూడా లేదని కుమార్తెను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ జీవితంలో పైస్థాయికి ఎదగాలని, విద్యా లక్ష్యాలను సాధించాలనే పట్టుదలతో ఉంది నిర్మల. గత సంవత్సరం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డిని సంప్రదించి జీవితంలో తన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయమని విజ్ఞప్తి చేసింది.
బాలిక దీనస్థితిని చూసి చలించిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి … జిల్లా కలెక్టర్ జి.సృజనకు పరిస్థితిని తెలియజేశారు. ఆమె జోక్యం చేసుకొని ముందుగా నిర్మలను బాల్య వివాహం నుంచి కాపాడారు. జిల్లా యంత్రాంగం ఆమెను ఆలూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో(Kasturba Gandhi Balika Vidyalaya) చేర్పించింది. బైపీసీ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకుంది. అయితే ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో 440 మార్కులకు 421 మార్కులను సాధించి టాపర్ గా నిలిచింది.
బాల్య వివాహం నుంచి బయటపడిన నిర్మల… టాపర్ గా నిలవటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మలకు అభినందనలు తెలుపుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మరోవైపు నిర్మల మీడియాతో మాట్లాడుతూ…. ఐపీఎస్ అధికారిణి కావాలనేది తన కల అని చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తానని… తనలాంటి ఆడపిల్లల కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటు అందించాలనేది తన లక్ష్యమని చెప్పుకొచింది.
శుక్రవారం ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల(AP Intermediate Results 2024) అయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 81 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా 79 శాతం మూడో స్థానంలో ఉంది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు 87 , ఎన్టీఆర్ 87 రెండో స్థానంలో ఉన్నాయి. 84 శాతంతో విశాఖ మూడో స్థానంలో ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో అల్లూరు జిల్లా 48 శాతంలో చివరి స్థానంలో ఉండగా, సెకండియర్ 63 శాతం చిత్తూరు చివరిస్థానంలో ఉన్నాయి. ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఈ ఏడాదీ బాలికలదే పై చేయి అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారన్నారు.