తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Alliance : తెలుగు రాష్ట్రాలపై కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్, బీజేపీ పొత్తులకు సై అంటుందా?

BJP Alliance : తెలుగు రాష్ట్రాలపై కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్, బీజేపీ పొత్తులకు సై అంటుందా?

13 May 2023, 16:00 IST

    • BJP Alliance : కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. దక్షిణాదిలో పాగావేయాలని ప్లాన్ చేసిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే నెక్ట్స్ ఏపీ, తెలంగాణ బీజేపీ వ్యూహం మారుతుందా? పొత్తులకు చోటుంటుందా?
బీజేపీ పొత్తులు
బీజేపీ పొత్తులు (Twitter )

బీజేపీ పొత్తులు

BJP Alliance : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్(113)ను దాటేసింది. ఇంకా 19 స్థానాల్లో హస్తం పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే కర్ణాటక ఫలితాలు... ఏపీ, తెలంగాణకు కీలకం కానున్నాయి. వచ్చే ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో... కర్ణాటక ఫలితాలు పొత్తులను డిసైడ్ చేస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధిష్ఠానం పొత్తులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతున్నా.. ఇప్పుడు ఆ కూటమిలోకి టీడీపీని లాగాలనేది పవన్ కల్యాణ్ ప్లాన్. మళ్లీ 2014 కాంబినేషన్ రిపీట్ చేసి ఏపీలో చక్రం తిప్పాలని టీడీపీ కూడా యోచిస్తుంది. బీజేపీకి వైసీపీతో విరుద్ధం లేకపోయినా... రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత లేకపోలేదు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. వైసీపీ విముక్త ఏపీ అంటున్న పవన్.. పొత్తుల కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ బీజేపీలో కొందరు పొత్తులకు ఓకే అంటుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అధిష్ఠానం ఏపీలో పొత్తులపై డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

బీజేపీ వ్యూహం మారుతుందా?

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం తరుణంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో బీజేపీ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ ప్రభావం నెక్ట్స్ జరిగే తెలుగు రాష్ట్రాలపై పడనుంది. తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను బీజేపీ ఢీకొంటుంది. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతున్న.. అది నామమాత్రమే. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి టైం వచ్చిందని కొందరు నేతలు అంటున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీని మళ్లీ దగ్గర చేర్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై ఇప్పటి వరకూ బీజేపీ నుంచి స్పందన లేదు. కర్ణాటక ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిపీట్ అయితే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలమే ఎదురవుతుంది. ఈ పరిస్థితి రాకుండా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఛాన్స్ ఉందా?

దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీకి కర్ణాటక ఫలితాలు షాకిచ్చాయి. నెక్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో బీజేపీ వ్యూహం మార్చే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన చేస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో టీడీపీకి ఇప్పటికే కొంత ఓటు షేర్ ఉంది. పొత్తులుంటే ఆ ఓట్లు బీజేపీ వైపు మళ్లే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇది కేసీఆర్ ఒక అస్త్రంగా మారుతుందని భావిస్తున్నారు. ఏపీలో బీజేపీ ఛాన్స్ లేకపోయినా పొత్తులు పెట్టుకుంటే ఒకటి, రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఎలాగైనా బీజేపీని పొత్తులోకి లాగాలని పవన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎలక్షన్ మేనేజ్మెంట్ లో వైసీపీకి కేంద్రంలోని బీజేపీ మద్దతు లేకుండా చేయాలని ప్రణాళికలు చేస్తున్నారు. కర్ణాటల ఫలితాలు ఇచ్చిన షాక్ తో బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో తన వ్యూహాన్ని మార్చుకుంటుందో? లేదో? వేచి చూడాలి.