FIR On IPS PV Sunil Kumar : కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో..? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను - ఐపీఎస్ సునీల్ కుమార్
12 July 2024, 16:07 IST
- FIR On IPS PV Sunil Kumar: తనపై నమోదైన కేసుపై ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ స్పందించారు. సుప్రీకోర్టు తిరస్కరించిన కేసులో ఎఫ్ఐఆర్ వేయడాన్నిఏమనాలో అంటూ ట్వీట్ చేశారు.
ఐపీఎస్ సునీల్ కుమార్ (ఫైల్ ఫొటో)
పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారని వైసీపీ మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ సీఎం జగన్ తో పాటు సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్సార్ ఆంజనేయులు, డీఎస్పీ విజయ్‌పాల్‌ను పేర్లను చేర్చారు. తనపై నమోదైన కేసుపై ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ 'X' వేదికగా స్పందించారు.
సుప్రీంకోర్టులో ఈ కేసు మూడేళ్లు నడిచిందని సునీల్ కుమార్ తన పోస్టులో రాసుకొచ్చారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో అని పేర్కొన్నారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.
జూన్ 10న రఘురామ ఫిర్యాదు….
కస్టోడియల్ టార్చర్‌పై చర్యలు తీసుకోవాలంటే దాదాపు మూడేళ్లుగా రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కస్టడీలో తనను హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీసులకు జూన్ 10న ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఎంపీ రఘురామను అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు కస్టడీలో టార్చర్‌కు గురి చేశారని ఫిర్యాదు చేయడంతో ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్‌తో పాటు సీతారామాంజనేయులు, డిఎస్పీ విజయ్‌పాల్, గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిలపై కేసు నమోదు చేశారు.
మాజీ సిఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కక్ష కట్టిన జగన్ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని రఘురామ ఆరోపించారు. సిఆర్‌పిఎఫ్ భద్రతలో ఉండగానే వారిని బలవంతంగా బయటకు పంపి హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకువచ్చి తీవ్రంగా హింసించారని ఆరోపించారు. తనను హింసిస్తున్న దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించి ఎవరికో పంపారని, వాటిని తాడేపల్లిలో ఉన్న వాళ్లు వీక్షించారని ఆరోపించారు.జగన్ ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని రఘురామ పలు సందర్భాల్లో ఆరోపించారు.
జూన్10న రఘురామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ సిఎం జగన్ సహా మరో ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదు చేశారు. భారత న్యాయ సంవిధాన్ సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
చంద్రబాబువి కక్ష సాధింపు చర్యలు - వైసీపీ
మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేయటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపిస్తున్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడిన కేసులో పోలీసులు కొట్టారంటూ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేయగా.. దాన్ని అడ్డం పెట్టుకుని కేసు నమోదు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుకు సంబంధించి రఘురామ ఫిర్యాదు చేయడం ఒక వింతైతే.. పోలీసులు కేసు నమోదు చేయడం మరో వింత అని దుయ్యబడుతున్నారు.