KTR On Jagan : జగన్ హీరో, షర్మిల జీరో- ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు-delhi brs ktr sensational comments on ap assembly election ys jagan sharmila ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ktr On Jagan : జగన్ హీరో, షర్మిల జీరో- ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR On Jagan : జగన్ హీరో, షర్మిల జీరో- ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR On Jagan : ఏపీ ఎన్నికల ఫలితాలు, జగన్ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జగన్ ఓటమి తనను షాక్ కు గురిచేసిందన్నారు. ప్రజలకు మంచి చేసినా జగన్ ఓడిపోవడం విచిత్రంగా అనిపించిందన్నారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు.

జగన్ హీరో, షర్మిల జీరో- ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR On Jagan : ఏపీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏపీలో జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్నారు. దిల్లీలో మీడియా చిట్‌చాట్ లో కేటీఆర్ మాట్లాడుతూ... వైసీపీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో జగన్ హీరో, షర్మిల జీరో అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రజలకు మంచి పనిచేసినా ఓడిపోయారన్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, అయినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలకు మంచి చేసిన ఎంతో మంది ఎన్నికల్లో ఓడిపోవడం విచిత్రంగా అనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా, ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, అది సాధారణ విషయం కాదన్నారు. 40 శాతం మంది ఓటర్లు జగన్‌ వెంటే ఉన్నారు. వైఎస్ షర్మిలకు అసలు నాయకత్వ లక్షణాలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో జగన్‌ను ఓడించేందుకు షర్మిలను ఒక పావులా వాడుకున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమితో జతకట్టడంతోనే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎప్పుడూ ప్రజల్లో తిరిగే కేతిరెడ్డి ధర్మవరంలో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు తనను షాక్‌కు గురిచేశాయన్నారు.

ఏపీ ఎన్నికల సమయంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ...ఏపీలో జగన్ గెలుస్తున్నారని చెప్పారు. తమకు పూర్తి సమాచారం ఉందని మళ్లీ జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏపీ ఓటర్లను ప్రభావితం చేసేలా కేసీఆర్ మాట్లాడరని కూటమి పార్టీలు విమర్శలు చేశాయి.

ప్రజల్ని నిందిస్తే ఏం ప్రయోజనం

తెలంగాణ లోక్ సభ ఫలితాలపై స్పందించిన కేటీఆర్...తమ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. ప్రజలతో కలవకపోవడం వల్లే తాము తెలంగాణలో ఓడిపోయామన్నారు. తమ వైఖరి కొంత మార్చుకోవాల్సి ఉందన్నారు. మాలో తప్పుపెట్టుకుని, ప్రజలను నిందిస్తే ఎలాంటి ప్రయోజనం ఉందన్నారు. ప్రజలకు, పార్టీ నేతలకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజల మద్దతు పొందలేకపోయామన్నారు. ఎన్ని చేసినా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఆనవాళ్లు చెరిపేయడం వారి తరం కాదన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూశామన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

పార్టీ ఫిరాయింపులపై ఫైర్

ఇక పార్టీ ఫిరాయింపుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ కపటత్వాన్ని బయటపెట్టి దిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తామన్నారు. రాహుల్‌ గాంధీ పనితీరు ఆస్కార్‌ లెవల్లో ఉందన్నారు. నాటు-నాటు తర్వాత రాహుల్‌గాంధీ ఆస్కార్‌ అవార్డ్‌ విజేతగా నిలుస్తారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా తనను తాను చిత్రీకరిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారన్నారు. బీజేపీ చేసిన పనినే కాంగ్రెస్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ లాక్కున్నప్పుడు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఒక వైపు రాజ్యాంగాన్ని చూపిస్తే, మరోవైపు అనైతిక పనులు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కపటనాటకాలను దిల్లీలో బట్టబయలు చేస్తామన్నారు. న్యాయం కోసం దిల్లీలో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను కలుస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపించాలని, కేవలం పాలనపైనే దృష్టి పెట్టాలని అభ్యర్థిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ విలీనం జరిగిందని, అది ఫిరాయింపులు కాదన్నారు.

సంబంధిత కథనం