Bandi Sanjay : 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ, ఆ షరతే అడ్డంకి- బండి సంజయ్-karimnagar central minister bandi sanjay says 26 brs mlas in touch with bjp ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ, ఆ షరతే అడ్డంకి- బండి సంజయ్

Bandi Sanjay : 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ, ఆ షరతే అడ్డంకి- బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 06:47 PM IST

Bandi Sanjay : బీజేపీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజీనామా షరతుతో వారంతా వెనక్కి తగ్గుతున్నారని తెలిపారు. బీజేపీ నైతిక విలువలకు కట్టుబడి ఉండే పార్టీ అన్నారు.

26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ, ఆ షరతే అడ్డంకి- బండి సంజయ్
26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ, ఆ షరతే అడ్డంకి- బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణలో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి వస్తేనే బీజేపీలో చేర్చుకుంటామనే షరతు విధించడంతో వెనక్కి తగ్గారని తెలిపారు. నాడు కేసీఆర్ మాదిరిగానే నేడు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆ రెండు పార్టీల మాదిరిగా బీజేపీ అనుసరిస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని చెప్పారు. నైతిక విలువలకు కట్టుబడి పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో ముందుకు పోతున్న బీజేపీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలిపారు.

కరీంనగర్ లో మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమేలేదని, మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈడీ కేసులున్న వాళ్లు, ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవని తెలిపారు. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు... ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన నిజంగా బాగుంటే... పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలన్నారు. ఒకవేళ ఉపఎన్నికలు జరిగితే కచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేశారు.

విభజన అంశాలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ యత్నం

రాష్ట్ర విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ది కోసం గత కేసీఆర్ ప్రభుత్వం జఠిలం చేసి సమస్యను నాన్చుతూ వచ్చారని బండి సంజయ్ విమర్శించారు. ఇప్పుడు ఆ అవసరం లేదని... రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారని తెలిపారు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశముందన్నారు. ఇప్పటికే కేసీఆర్ గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నానని చెప్పారు. సీఎంలు చర్చించుకున్న విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలకు సానుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

కరీంనగర్ హసన్ పర్తి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్

రైల్వే సౌకర్యం పెద్దగా లేని కరీంనగర్ జిల్లాకు కొత్తగా కరీంనగర్ హసన్ పర్తి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ లభించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయిందన్నారు. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగకపోయినా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కరీంనగర్ హసన్ పర్తి లైన్ పూర్తయితే దిల్లీకి వెళ్లే ప్రతి రైలు కరీంనగర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా రైల్వేకు ఆదాయం మార్గంగా మారుతుందని తెలిపారు. కరీంనగర్ హసన్ పర్తి రైల్వే లైన్ ప్రతిపాదనను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మూలన పడిందని తెలిపారు. ఆ లైన్ ప్రజా ప్రయోజనకరంగా ఉండదని భావించి గత ప్రభుత్వం తొక్కి పెట్టిందని తెలిపారు. తాను ఎంపీ అయ్యాక కరీంనగర్ హాసన్పర్తి రైల్వే లైన్ ప్రతిపాదన పైల్ ను వెలికి తీసి సాధ్యాసాధ్యాలపై రూ.20 కోట్లతో సర్వే చేయించి రైలు మార్గానికి మోక్షం లభించేలా చర్యలు చేపట్టానని చెప్పారు.‌

ప్రసాద్ స్కీమ్... రామాయణం సర్క్యూట్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాలకు ప్రసాద్ స్కీమ్ కింద చేర్చడంతో పాటు రాముడు నడియాడిన నేల రామాయణానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్న ఆలయాలను కలుపుతూ రామాయణం సర్క్యూట్ కింద అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రసాద్ స్కీం కింద వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయాలను రామాయణం సర్క్యూట్ కింద డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. ఆలయాల అభివృద్ధి తోపాటు పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికైనా రావచ్చు

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నారని మీడియా ప్రతినిధులు అడగగా ఎవరైనా అధ్యక్షులు కావచ్చని, పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. ప్రస్తుతం ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు రేసులో ఉన్నారని మీడియా ప్రతినిధులు చెప్పగా ఎవరైనా కావచ్చని బండి సంజయ్ స్పష్టం చేశారు. కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులుంటాయని తెలిపారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చేయాలనే దానిపై ఆలోచించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొదటినుంచి పార్టీలో ఉన్నవారికే అద్యక్ష పదవి ఇస్తారా? కొత్త వారికి ఇస్తారా అని ప్రశ్నించగా కొత్తగా వచ్చిన వారికి ఇవ్వొద్దనే నిబంధన లేదని... అలా అనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన 14 మందికి టికెట్లు ఇచ్చామని అలాంటి సమస్య ఉండబోదని స్పష్టం చేశారు. పార్టీలో ప్రస్తుతం ఉన్నవారు అందరూ సమర్థులేనని అధ్యక్ష పదవి ఎవరికైనా రావచ్చని బండి సంజయ్ తెలిపారు.

దిల్లీ లేదా కరీంనగర్ లో ఉంటా

పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేసే వారికి ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు బండి సంజయ్. అందుకు తానే నిదర్శనమని చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చాలా కీలకమైందని.. పార్టీలో కరుడుగట్టిన నిబద్దత గల వారికే ఆ పదవి దక్కుతుందని, ప్రస్తుతం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రి అయిన తాను దిల్లీకే పరిమితం కాకుండా వారంలో రెండు రోజులు శని, ఆదివారాల్లో ప్రజలకు అందుబాటులో కరీంనగర్ లో ఉంటానని తెలిపారు.‌ కరీంనగర్ లేదంటే దిల్లీ తప్ప హైదరాబాద్ లో ఉండనని హైదరాబాద్ తో తనకు పెద్దగా పని ఉండదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించలేదన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కేంద్రం గడువు పొడిగించిందని చెప్పారు. గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.

రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం