BRS to Congress : 'కారు' దిగిన గద్వాల ఎమ్మెల్యే - కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి
Gadwala MLA Bandla Krishnamohan Reddy : గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Gadwala MLA Bandla Krishnamohan Reddy : బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. గద్వాల నుంచి గెలిచిన కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణామోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల నుంచి కృష్ణామోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో తొలిసారిగా గెలిచిన ఆయన… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కృష్ణామోహన్ రెడ్డి… డీకే అరుణ చేతిలో 8,260 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కొద్దిరోజుల ముందే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సరితా తిరుపతయ్యతో పాటు ఆమె వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కృష్ణామోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని ఆందోళనలకు కూడా దిగింది. సరితా తిరుపతయ్య కన్నీటిపర్యంతం కూడా అయ్యారు. అప్పట్నుంచే కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో కృష్ణామోహన్ రెడ్డి టచ్ లో ఉండగా… మరోవైపు సరితా తిరుపతయ్యను పార్టీ పెద్దలు బుజ్జగించారు. పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే… ఆయన చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది.
2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య హస్తం గూటికి చేరారు. తాజాగా కృష్ణమోహన్ రెడ్డి చేరితో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరింది. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.