BRS Office Permissions: బీఆర్ఎస్ ఆఫీసులకు అనుమతులు లేవు, ఆస్తి పన్ను చెల్లింపులు అసలే లేవు..
BRS Office Permissions: అధికారం కోల్పోగానే కష్టాలు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు కారు దిగి కాంగ్రెస్ లో చేరి చేయెత్తి జై కొడుతుంటే పదేళ్ళు అధికారంలో ఉండి చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది.
BRS Office Permissions: అధికారం మనదే...మనల్ని ఆపేదెవరు అనుకున్నారేమో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఆఫీసులను ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో మినహా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాల్లో నిర్మించిన ఆఫీసులకు ఎలాంటి నిర్మాణ అనుమతుల్లేవు.

అప్పట్లో అధికార పార్టీ కావడంతో పంచాయతీ, మున్సిపల్ ఆఫీసర్లు కూడా ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. తాజాగా ఇతర జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ ఆఫీసు లపై వివాదం నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ఆఫీసుల నిర్మాణంపైనా చర్చ జరుగుతోంది.
వంద రూపాయలకే ఎకరం కెటాయించిన కేసిఆర్ సర్కార్
బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు విలువైన భూములు కేసిఆర్ సర్కార్ కెటాయించింది. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణానికి కోట్లాది విలువైన భూములను రూ.100 ఎకరం చొప్పున కేటాయిస్తూ 2019 జూన్ లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తమ పార్టీకి మాత్రమే భూమి కేటాయించుకుని గుర్తింపు పొందిన ఇతర పార్టీలకు మాత్రం మొండిచేయి చూపింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కో ఆఫీసు నిర్మాణానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ ఫండ్ ఇస్తూ.. నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
కానీ లీడర్లు మాత్రం చాలా జిల్లాల్లో ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండానే అదే నెల 24న రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో ఒకేసారి పార్టీ ఆఫీసుల నిర్మాణ పనులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో అప్పటి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సిరిసిల్లలో జడ్పీ చైర్పర్సన్ అరుణ, పెద్దపల్లిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జగిత్యాలలో అప్పటి ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. నిర్మాణ క్రమంలో కేవలం సిరిసిల్లలో మాత్రమే పార్టీ ఆఫీస్, అందులో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి డీటీసీపీ పర్మిషన్ తీసుకున్నారు.
అసెస్మెంట్ చేయలేదు.. ట్యాక్స్ కట్టించుకోలేదు
అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ ఆఫీసుల్లో కేవలం జగిత్యాల ధరూర్ క్యాంప్ లో నిర్మించిన తెలంగాణ భవన్ కు మాత్రమే మున్ని పల్ ఆఫీసర్లు అసెస్మెంట్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ రూ .12,646గా వేశారు. అయితే 2019-20 నుంచి ఇప్పటి వరకు ఆర్నెళ్లకోసారి చొప్పున 10 విడతల్లో మున్సిపాలిటీ రెవెన్యూ విభాగం సిబ్బంది డిమాండ్ నోటీసులు పంపినా ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించలేదు.
దీంతో ఈ ఆఫీసు బకాయిలు రూ.1.73 లక్షల మేర పేరుకుపోయాయి. అలాగే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో వేములవాడ హైవే పక్కనే నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్ కు అనుమతులు లేవు. ఇప్పటివరకు పంచాయతీ సిబ్బంది అసెస్ మెంట్ చేయలేదు. ఇంటి నంబర్ ఇవ్వలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ నిర్ధారించలేదు.
పెద్దపల్లి జిల్లా ఆఫీసును గౌరెడ్డిపేటలో నిర్మించారు. డీటీసీపీకి దరఖాస్తు చేసినా పర్మిషన్ రాలేదు. అయినా బిల్డింగ్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఈ బిల్డింగ్ కు అసెస్ మెంట్ కూడా చేయలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం లేదు.
సిరిసిల్ల లో ఖరీదైన స్థలంలో తెలంగాణ భవన్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పక్కనే అత్యంత ఖరీదైన స్థలంలో మూడు ఫ్లోర్లలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ పేరుతో నిర్మించారు. ఇదే స్థలంలో ఓ ఫంక్షన్ హాల్ కూడా కట్టారు. ఈ బిల్డింగ్ ను ప్రారంభించి ఏడాది కావొస్తున్నా.. ఇప్పటి వరకు అసెస్ మెంట్ చేయలేదు. దీంతో లక్షలాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ ఖజానాకు రాకుండా పోతోంది.
అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాలకు ఇప్పటికే అధికారులు నోటీస్ లు జారీ చేశారు. మరి వసూలు చేస్తారా... రాజకీయ జోక్యంతో వదిలేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)