Karimnagar Politics: కరీంనగర్‌ మునిసిపల్ కార్పొరేషన్‌‌పై పట్టు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వార్-war between congress and brs for control of karimnagar municipal corporation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Politics: కరీంనగర్‌ మునిసిపల్ కార్పొరేషన్‌‌పై పట్టు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వార్

Karimnagar Politics: కరీంనగర్‌ మునిసిపల్ కార్పొరేషన్‌‌పై పట్టు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వార్

HT Telugu Desk HT Telugu
Published Jun 20, 2024 07:53 AM IST

Karimnagar Politics: కరీంనగర్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. నగర పాలక సంస్థ యవ్వారం పై ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంది.

కరీంనగర్‌ కార్పొరేషన్‌పై పట్టుకోసం రగడ
కరీంనగర్‌ కార్పొరేషన్‌పై పట్టుకోసం రగడ

Karimnagar Politics: కరీంనగర్ రాజకీయం రంజుగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ మేయర్ వై.సునీల్ రావు అన్నట్లు రాజకీయం నడుస్తోంది. మేయర్ పదవి నుంచి సునీల్ రావు ను దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేలా గులాబీ సైన్యం సిద్దమై వాగ్ధాటి చేస్తుంది. నేతల మద్య మాటల యుద్ధం సాగుతోంది. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

నగర పాలక సంస్థపై మంత్రి పొన్నం నజర్

కరీంనగర్ నగర్ పాలక సంస్థపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.‌ ఏకపక్షంగా మంత్రి పొన్నం మున్సిపల్ పై నిర్వహించిన సమీక్షా సమావేశం రాజకీయ విమర్శలకు వేదికయింది. కార్పొరేషన్ అంటే ఐదులక్షల జనాభా, 60 డివిజన్లు, రూ.650 కోట్ల బడ్జెట్. స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు లకు కనీస సమాచారం ఇవ్వకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

స్మార్ట్ సిటీ పనులతోపాటు శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, పన్నుల వసూలు, తాగునీటి సరఫరా, పలు అంశాలపై సమీక్షించిన మంత్రి పొన్నం అనవసర ఖర్చులు, అవకతవకలపై అధికారులను సుతిమెత్తగా మందలించారు. గత ప్రభుత్వం ప్రస్తుత పాలక వర్గం చేపట్టిన పనులపై విచారణకు ఆదేశించి మున్సిపల్ అధికారులతోపాటు పాలక పక్షానికి భయాందోళనకు గురి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని ఏ పని చేపట్టినా జవాబుదారిగా ఉండాలని ఆదేశించి పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరోక్షంగా పాలక పక్షానికి చురకలు అంటించారు. ప్రతిపాదన లేకుండా వ్యయాన్ని పెంచేసి చేపట్టిన పనులపై అసహనం వ్యక్తం చేస్తు తప్పు జరిగినట్లు నిరూపణ అయితే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.

కరీంనగర్‌తో పొన్నంకు సంబంధం ఏంటన్న మేయర్..

నగరపాలక సంస్థ ప్రగతి పనుల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించడం... ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం బాగానే ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులకు పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా సమీక్ష సమావేశం నిర్వహించడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మంత్రి పొన్నం పై మేయర్ సునీల్ రావు పైర్ అయ్యారు.

పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా ఓటర్ కాదని, కరీంనగర్ తో సంబంధం లేని వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహించడం ఏంటనీ ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు 3 సార్లు ఓడగొట్టారని విధి లేక పక్క జిల్లా సిద్దిపేటలోని హుస్నాబాద్ కు పారిపోయాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కరీంనగర్ పై పెత్తనం ఏంటని ప్రశ్నించారు.‌

పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ తో సంబంధం లేదని అందుకు ఆయనకు సిద్దిపేట జిల్లా అధికారులు కెటాయించిన సెక్యూరిటీయే నిదర్శనమన్నారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా జిల్లాకు సంబంధం లేని వ్యక్తి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు 3 సార్లు ఓడగొట్టారని కసితో ఉన్న పొన్నం, నగర పాలక సంస్థపై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అభివృద్ధి పై పొన్నంకు అంత శ్రద్ద ఉంటే రాజకీయంగా జన్మనిచ్చిన హుస్నాబాద్ పై సమీక్ష పెట్టుకోండని ఉచిత సలహా ఇచ్చారు. మీరు అధికారం లో ఉన్నపుడు ఏమి అభివృద్ధి చేసారో అందరికీ తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ నగరపాలక సంస్థ కు 4 కోట్ల క్యాష్ అవార్డు ఇచ్చారని అది మీ కండ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నగరాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దాం..35 చోట్ల ఓపెన్ జిమ్ లు ఏర్పారు చేసాము...ఇంకా 30 ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మంత్రి హోదాలో ఉన్న పొన్నం అన్ని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. అధికారులను పాలక వర్గాన్ని భయపెట్టే మనస్తత్వం మార్చుకోవాలని హితవు పలికారు. కేంద్రం నుండి నిధులు మంజూరు చేయించింది ఎంపీ బండి సంజయ్ అని తెలిపారు. నగర అభివృద్ధికి బండి సంజయ్ సహకరించారు... మీరు ఏమి చేశారో చెప్పండన్నారు. పొన్నం చేసే ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మేయర్ స్పష్టం చేశారు.

మేయర్‌పై పొన్నం అనుచరులు ఆగ్రహం

మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో నగరపాలక సంస్థను అవినీతి మయంగా మార్చి మేయర్ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు ఆరోపించారు.‌

అతని నుంచి నగరపాలక సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో పుట్టిపెరిగిన వ్యక్తిగా.. రాష్ట్ర మంత్రి గా ఉమ్మడి జిల్లా వాసిగా కరీంనగర్ నగర్ పాలక సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తే మేయర్ కు ఎందుకు కడుపుమంట అని ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పోరేటర్ లు తోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.

రాజకీయంగా కక్ష సాధింపేనా?

నగరపాలక సంస్థ విషయంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య పరస్పర ఆరోపణలు విమర్శలు నేతల మధ్య మాటల యుద్ధానికి రాజకీయ కక్ష సాధింపులో భాగమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ మేయర్ అయిన సునీల్ రావు, ఏ పదవిలో లేని మాజీ ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ నిరసన ఆందోళన చేపడితే పొన్నం ఒక స్క్రాప్ అని విమర్శించారు. ఆ మాటను మదిలో పెట్టుకున్న పొన్నం ప్రస్తుతం మంత్రి కావడంతో తానంటే ఏమిటో నిరూపించేందుకు నగరపాలక సంస్థపై నజర్ వేసినట్లు ప్రచారం జరుగుతుంది.‌

అందులో భాగంగానే మున్సిపల్ పై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడమే కాకుండా గతంలో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపం అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో పాటు పాలకవర్గాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని నగర ప్రజలు భావిస్తున్నారు. ఒకప్పుడు ఒక్క తాను ముక్కలే అయిన మేయర్, మంత్రి ఇప్పుడు అధికార విపక్షంగా మారి ఆధిపత్యం కోసం రాజకీయ డ్రామాకు తెరలేపారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.‌

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

Whats_app_banner

సంబంధిత కథనం