RRR Complaint: కస్టోడియల్ టార్చర్‌పై మాజీ సిఎం జగన్, సిఐడి చీఫ్‌లపై రఘురామ ఫిర్యాదు-tdp leader ramakrishna raju lodges complaint against outgoing cm jagan some officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rrr Complaint: కస్టోడియల్ టార్చర్‌పై మాజీ సిఎం జగన్, సిఐడి చీఫ్‌లపై రఘురామ ఫిర్యాదు

RRR Complaint: కస్టోడియల్ టార్చర్‌పై మాజీ సిఎం జగన్, సిఐడి చీఫ్‌లపై రఘురామ ఫిర్యాదు

Sarath chandra.B HT Telugu
Jun 11, 2024 07:11 AM IST

RRR Complaint: అక్రమ నిర్బంధం, కస్టోడియల్ టార్చర్ అభియోగాలతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సిఎం జగన్‌, సిఐడి మాజీ చీఫ్‌ సునీల్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులపై రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు.

మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు
మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు

RRR Complaint: అక్రమంగా నిర్బంధించడంతో పాటు కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డితో పాటు కొందరు ఉన్నతాధికారులు తనపై కుట్ర పూరితంగా అరెస్ట్ చేసి హింసించారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే కె.రఘు రామకృష్ణరాజు సోమవారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

కస్టడీలో ఉన్న సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారని, తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదులో ఆరోపించారు. 2021లో హైదరాబాద్‌లో ఉన్న తనను కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో అరెస్టు చేశారని, ఆ సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న పోలీసు అధికారి ఆర్ విజయ పాల్, ప్రభుత్వ వైద్యురాలు జి.ప్రభావతి ప్రమేయం ఉందని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేశారని రఘురామ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సీబీసీఐడీ తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని 2021 మే 14న సరైన ప్రక్రియ లేకుండా, లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని, బెదిరించి, చట్టవిరుద్ధంగా పోలీసు వాహనంలోకి తీసుకెళ్లి, అదే రోజు రాత్రి బలవంతంగా గుంటూరుకు తరలించినట్టు రఘురామ రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అరెస్టుకు కొన్ని వారాల ముందు తాను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నానని, ముఖ్యమంత్రిని రాజకీయంగా విమర్శించినందుకు తనను వైసీపీ నాయకులు దూషించారని, చంపేస్తామని బెదిరించారని రాజు ఆరోపించారు.

దాదాపు మూడు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామకృష్ణం రాజును తొలుత చికిత్స కోసం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజుల తర్వాత నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

నిందితులందరిపై పోలీస్ కేసు నమోదు చేయాలని, క్రిమినల్ నేరాలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. 2019లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో సన్నిహితంగా మెలగడంతో విభేదాలు మొదలయ్యాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా నేరుగా బీజేపీ పెద్దలతో స్నేహం చేయడం, చివరకు పార్టీపై విమర్శలు చేసే వరకు దారి తీసింది.

అరెస్ట్ తర్వాత రఘురామ దాదాపు మూడేళ్లు సొంత నియోజక వర్గానికి దూరంగా ఢిల్లీ, హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ దక్కకుండా వైసీపీ అడ్డు పడిందని ఆరోపణలు చేశారు. చివరి నిమిషం వరకు ఆయన పోటీ విషయంలో సందిగ్ధత కొనసాగింది. రఘురామకు టిక్కెట్ కేటాయించాలని టీడీపీ నాయకులు ఒత్తిడి చేయడంతో ఉండి స్థానాన్ని టీడీపీ కేటాయించింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గతంలో తనను ఇబ్బందులకు గురి చేసిన నాయకులు, అధికారులపై బదులు తీర్చుకోవాలని, చట్ట ప్రకారం వారిపై చర్యల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం