తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Reasons For Ap Debts: ఆదాయం మూరెడు, పంచేదేమో బారెడు, ఆంధ్రా నడవాలంటే అప్పులే ఆధారం.. కారణాలేంటి?

Reasons for AP Debts: ఆదాయం మూరెడు, పంచేదేమో బారెడు, ఆంధ్రా నడవాలంటే అప్పులే ఆధారం.. కారణాలేంటి?

Sarath chandra.B HT Telugu

22 July 2024, 5:00 IST

google News
    • Reasons for AP Debts: అధికారంలోకి వచ్చామనే సంతోషం కంటే కొండల్లా పేరుకుపోతున్న అప్పులే ఆంధ్రా ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. అప్పు పుట్టకపోతే అడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. 
అప్పు పుట్టకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏపీలో లేదా?
అప్పు పుట్టకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏపీలో లేదా?

అప్పు పుట్టకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏపీలో లేదా?

Reasons for AP Debts: నిన్న మొన్నటి దాకా వైఎస్సార్సీపీ పంచుడు పథకాలని విమర్శించిన నోటితోనే వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి కొత్త ప్రభుత్వానికి ఉంది.

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలన్నర రోజులు మాత్రమే గడిచాయి. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయడానికి నానా తంటాలు పడుతోంది.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే ఆర్‌‌బిఐ నుంచి బాండ్ల వేలం ద్వారా రూ.9వేల కోట్ల రుపాయలను రుణాలను ప్రభుత్వం సమీకరించింది. అప్పు పుట్టకపోతే అడుగు ముందుకు వేసే పరిస్థితులు లేవు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కోసం గత ఏడాది నవంబర్‌‌లో టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి విజయావకాశాలను చేకూర్చిన పలు పథకాల ప్రభావంతో వాటిని టీడీపీ మ్యానిఫెస్టోలో చేర్చారు. గత ఏడాది రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారంటీల మినీ మ్యానిఫెస్టోను టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత జనసేన కూడా జత కలవడంతో ఇప్పుడు మరో ఐదు గ్యారంటీలు కలుపుకుని మొత్తం 11 గ్యారంటీలతో ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోగా ప్రకటించారు.

గతంలో టీడీపీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. ఆరు గ్యారంటీల్లో మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు వంటి హామీలు ఉన్నాయి.

నగదు బదిలీలతో వేల కోట్ల భారం...

  • ఏపీలో అమలు చేస్తున్న డిబిటి పథకాలతో ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 44,48,865మంది మహిళలకు ఏటా రూ.15వేల రుపాయల నగదు బదిలీ అమలు చేశారు.
  • వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో స్వయం సహాయక బృందాల్లో ఉన్న కోటి ఐదు లక్షల 13వేల 365మందికి లబ్ది కలిగింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,39,703 మందికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.
  • వైఎస్సార్ ఆసరా పథకంలో 78,94,169మందికి లబ్ది కలిగింది. వైఎస్సాఆర్ కాపు నేస్తంలో 3,58,613 మందికి నగదు బదిలీ చేశారు. ఈబీసీ నేస్తంలో 4,39,134 మందికి,కళ్యాణమస్తులో 56,194మందికి, ఇళ్ల పట్టాల రూపంలో మరో 31,19,000మందికి లబ్ది చేకూర్చారు.
  • ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ప్రధానంగా జగనన్న అమ్మఒడి పథకంలో 44,48,865మందికి రూ.26,067.30కోట్లను జమ చేశారు. జగనన్న వసతి దీవెనలో 25,17,245మందికి రూ.4,275.76 కోట్లను అందించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728మందికి రూ.12,609.68కోట్లను అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 408మందికి రూ.107.07కోట్లను ఇచ్చారు.

నగదు బదిలీ భారం రెట్టింపు...

చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో రాష్ట్ర ఖజానాపై ఆర్ధిక భారం రెట్టింపు కానుంది. అమ్మఒడి పథకంలో నాలుగు విడతల్లో రూ.26వేల కోట్లను వైసీపీ చెల్లిస్తే టీడీపీ కూటమి ఇచ్చిన తల్లికి వందన పథకం హామీని అమలు చేయాలంటే ఏటా రూ.6300కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

వైఎస్సార్‌ పెన్షన్ కానుక ద్వారా నెల నెల పెన్షన్ల చెల్లింపులో భాగంగా 66,34,742 మందికి ప్రతి నెల రూ.3వేల చొప్పున 58నెలల్లో రూ.88,650.60కోట్లను చెల్లించారు. 2024 ఏప్రిల్ నుంచి దానిని రూ.4వేలకు పెంచారు.అన్ని విభాగాల్లో పెంచిన మొత్తాన్ని చెల్లించాలంటే ప్రతి నెల రూ3500కోట్లను పెన్షన్ల రూపంలో ప్రభుత్వ ఖజానా చెల్లించాల్సి ఉంటుంది.

అసలైన లబ్దిదారులకు మాత్రమే సంక్షేమ పథకాలను వర్తింప చేసి, ప్రభుత్వ బడుల్లో చదువుకునే వారికి మాత్రమే తల్లికి వందనం వంటి పథకాలను వర్తింప చేసినా కనీసం ఏటా రూ.20వేల కోట్ల రుపాయలు అదనంగా డిబిటి పథకాలకు వినియోగించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.

మాట నిలబెట్టుకోవాల్సిందే...

ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అనివార్యంగా నిలబెట్టుకోవాల్సిన రాజకీయ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. పథకాల సాధ్యా సాధ్యాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మాటెలా ఉన్నా వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన ఒత్తిడి మాత్రం ప్రభుత్వంపై నిరంతరం ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం అందిస్తే సరిపోతుందనే అతి నమ్మకాన్ని ప్రజలు ఎన్నికల్లో తప్పని నిరూపించారు.

గత ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 26,39,703మంది మహిళలకు రూ.14,129.12 కోట్లను అందించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78,94,169మందికి రూ.25,570కోట్లను చెల్లించారు. వైఎస్సార్ కాపు నేస్తంలో 3,58,613మందికి రూ.2,029.92కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తంలో 82,130మందికి రూ.982.98 కోట్లు చెల్లించారు.వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 4,39,134 మందికి రూ.1257.14 కోట్లు చెల్లించారు. 45-59 ఏళ్ల వయసున్న మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను అమలు చేశారు.

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 చెల్లిస్తామని ప్రకటించారు. 50ఏళ్లు దాటిన వారికి రూ.4వేల పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌ వంటి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఆచరణలో ఏ మేరకు సాధ్యమనేది కూడా అంతుచిక్కని ప్రశ్న.

( ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో మరో కథనంలో)

తదుపరి వ్యాసం