Andhra Pradesh Debts: ఆంధ్రాలో అప్పులు అనివార్యం, డిబిటిలతో ప్రభుత్వాలపై మోయలేని భారం..సమన్వయమే అసలు సమస్య
17 July 2024, 19:14 IST
- Andhra Pradesh Debts: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంది. ఓ వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు తప్పనిసరి అవసరాలు, చెల్లింపుల మధ్య రాష్ట్రం సతమతమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెలరోజుల్లోనే సెక్యూరిటీల వేలంతో రూ.9వేల కోట్ల రుపాయలు సమీకరించింది. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Andhra Pradesh Debts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ముందున్న ఆర్ధిక సవాళ్లు సర్కారును కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే ఆర్‌బిఐ వేలంలో రూ.9కోట్లను సమీకరించారు. జూన్ 12న రూ.2వేల కోట్లు, జూన్ 28న రూ.5వేల కోట్లు, జూలై 12న రూ.2వేల కోట్లను సమీకరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఏటా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల రూపంలో రూ.52వేల కోట్ల రుపాయల్ని ప్రజలకు నేరుగా పంచిపెట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మరో రూ.20-30వేల కోట్ల రుపాయలు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఏపీలో సంక్షేమ పథకాల్లో భాగంగా తప్పనిసరిగా అందించే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ఏటా లబ్దిదారులకు బదిలీ చేస్తున్న సొమ్ము ఏటా రూ.52వేల కోట్ల రుపాయలుగా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల రూపంలో లబ్దిదారులకు కొన్ని పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేస్తున్నారు. వీటిలో కొన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి.
2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న కొన్ని పథకాలను మరింత మెరుగ్గా తాము అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా తమను గెలిపిస్తే జనాలకు ఏమి చేస్తామో వివరిస్తూ వరాలు కురిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కనీవిని ఎరుగని మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెంచిన పెన్షన్లను ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు. ఈ పథకంలో ప్రతి నెల రూ.3500కోట్ల రుపాయలను పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలకే రూ.52వేల కోట్లను ఏటా చేయాల్సి వస్తే, చంద్రబాబు ఇచ్చిన హామీలు కలిపితే ఆ భారం మరింత పెరుగనుంది. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ఏటా రూ.73,440కోట్ల రుపాయలు అవసరమని ఏపీ ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు అంచనా వేసినట్టు సిద్ధం సభల్లో జగన్ చెప్పారు.
బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కూడా కలుపుకుంటే మరో రూ.13,872 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన ఏడు పథకాలకు 87,312 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని, ఇప్పటికే అమలు చేస్తున్న డిబిటి పథకాలతో కలిపితే అది రూ.1.40లక్షల కోట్లకు చేరుతుందనేది జగన్ మాట.
సూపర్ సిక్స్‌తో టీడీపీ మ్యానిఫెస్టో....
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం గత ఏడాది నవంబర్‌లో టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలను చేకూర్చిన పలు పథకాలను మ్యానిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది. గత ఏడాది రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారంటీల మినీ మ్యానిఫెస్టోను టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత జనసేన కూడా జత కలవడంతో ఇప్పుడు మరో ఐదు గ్యారంటీలు కలుపుకుని మొత్తం 11 గ్యారంటీలతో ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోగా ప్రకటించారు.ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి మ్యానిఫెస్టో మాటెలా ఉన్నా ప్రజలు మాత్రం భారీగా విజయాన్ని కట్టబెట్టారు.
టీడీపీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ.10లక్షల వరకూ రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. ఆరు గ్యారంటీల్లో మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు వంటి హామీలు ఉన్నాయి.
అమ్మఒడి....
- జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 44,48,865మంది మహిళలకు ఏటా రూ.15వేల రుపాయల నగదు బదిలీ అమలు చేశారు. వసతిదీవెప పథకంలో ఉన్నత చదువుల కోసం హాస్టళ్లలో ఉండే వారి కోసం 25,17,245మందికి పథకాన్ని వర్తింప చేశారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728మందికి ప్రయోజనం దక్కింది.
- వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో స్వయం సహాయక బృందాల్లో ఉన్న కోటి ఐదు లక్షల 13వేల 365మందికి లబ్ది కలిగింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,39,703 మందికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.
- వైఎస్సార్ ఆసరా పథకంలో 78,94,169మందికి లబ్ది కలిగింది. వైఎస్సాఆర్ కాపు నేస్తంలో 3,58,613 మందికి నగదు బదిలీ చేశారు. ఈబీసీ నేస్తంలో 4,39,134 మందికి,కళ్యాణమస్తులో 56,194మందికి, ఇళ్ల పట్టాల రూపంలో మరో 31,19,000మందికి లబ్ది చేకూర్చారు.
3,46,85,016 మంది లబ్దిదారులు…..
ఏపీలో అమలవుతున్న అన్ని రకాల పథకాల్లో కలిపి ఏకంగా మూడు కోట్ల 64లక్షల 85వేల 16మంది(3,46,85,016) మహిళలకు ఐదేళ్లలో(2024 మార్చి వరకు) నేరుగా లబ్ది అందుకున్నారు. వీరిలో ఒక్కొక్కరు రెండు మూడు పథకాల్లో అర్హత పొంది నగదు రూపంలో లబ్ది అందుకున్న వారు కూడా ఉన్నారు.
నగదు రూపంలో వారు అందుకున్న మొత్తం చూస్తే దాదాపు లక్షన్నర కోట్ల రుపాయలను నేరుగా మహిళలు బ్యాంకు ఖాతాలకు అందుకున్నారు. మొత్తం 3,46,85,016 మందికి ఐదేళ్లలో రూ.1,68,264.08 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ఒక్కో ఇంటికి సగటున ఒక్కో పథకం ద్వారా కనీసం రూ.50వేల ఆర్థిక ప్రయోజనం అందించారు. రెండు మూడు పథకాలు అందుకున్న వారికి లక్షకు పైగా లబ్ది చేకూరింది.
ఓటర్ల కంటే లబ్దిదారులే అధికం…
ఆంధ్రప్రదేశ్‌లో 2024 మార్చి 16నాటికి మొత్తం 4,09,37353మంది ఓటర్లుఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 2,00,84,276మంది ఉన్నారు. సంక్షేమ పథకాల రూపంలో ఏపీ ప్రభుత్వం ఐదేళ్లలో మూడున్నర కోట్ల లావాదేవీలను కేవలం మహిళలే లక్ష్యంగా డిబిటి పథకాల రూపంలో అందించింది. ఒక్కో ఇంట్లో రెండు మూడు పథకాలకు డిబిటి స్కీమ్స్ అందడంతో ఓటర్ల సంఖ్య కంటే లబ్దిదారుల సంఖ్య రెట్టింపుగా ఉంది.
రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో లబ్దిదారులకు ప్రయోజనం అందించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒక్కొక్కరికి ఒకటికి మించి నగదు బదిలీ పథకాలకు అర్హత కల్పించడం ద్వారా ఐదేళ్లలో కోట్ల సంఖ్యలో లబ్దిదారులకు ఆర్ధిక ప్రయోజనాలు అందాయి.
ఏపీలో నగదు బదిలీ పథకాల గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన లెక్కలు కనిపించాయి. 58నెలల్లో దాదాపు 8,35,04,830మందికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో లబ్ది పొందారు. వీటి ద్వారా ఏకంగా రూ.2,58,855.97 కోట్ల రుపాయలు లబ్దిదారుల ఖాతాలకు జమ చేశారు.
- ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ప్రధానంగా జగనన్న అమ్మఒడి పథకంలో 44,48,865మందికి రూ.26,067.30కోట్లను జమ చేశారు. జగనన్న వసతి దీవెనలో 25,17,245మందికి రూ.4,275.76 కోట్లను అందించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728మందికి రూ.12,609.68కోట్లను అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 408మందికి రూ.107.07కోట్లను ఇచ్చారు.
- వైఎస్సార్ రైతు భరోసా పథకంలో 53,58,366మందికి రూ.34,378.16కోట్లను ఇచ్చారు. రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంలో 84,66,217మందికి రూ.2,050.53 కోట్లు, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంట రుణాల్లో 54,75,651మందికి రూ.7,802.05కోట్లు, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీలుగా 22,84,841 మందికి రూ.1976.43కోట్లు చెల్లించారు.
నెలకు 66.34లక్షల పెన్షన్లు...
- వైఎస్సార్ మత్స్యకార భరోసాలో 2,43,443మందికి రూ.538.06కోట్లు, స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మందికి రూ.4969 కోట్లు అందించారు. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా నెల నెల పెన్షన్ల చెల్లింపులో భాగంగా 66,34,742 మందికి ప్రతి నెల రూ.3వేల చొప్పున 58నెలల్లో రూ.88,650.60కోట్లను చెల్లించారు.
- వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 26,39,703మంది మహిళలకు రూ.14,129.12 కోట్లను అందించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78,94,169మందికి రూ.25,570కోట్లను చెల్లించారు. వైఎస్సార్ బీమా పథకంలో 1,03,171మందికి రూ.1848.70కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తంలో 3,58,613మందికి రూ.2,029.92కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తంలో 82,130మందికి రూ.982.98 కోట్లు చెల్లించారు.
- జగనన్న చేదోడు ద్వారా రజక, టైలర్లు, నాయి బ్రాహ్మణులైన 3,37,802 మందికి రూ.2029.92కోట్లు చెల్లించారు. వైఎస్సార్ లా నేస్తంలో 5781 మందికి రూ.41.52కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2,76,368మందికి రూ.1,302.34 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆరోగ్యచికిత్సలు పొందిన 15,64,997మందికి రూ.971.28కోట్లు, ఎంఎస్‌ఎంఇ యూనిట్ల పునరుద్దరణలో 23,236మందికి రూ.2,086.42కోట్లు, అగ్రిగోల్డ్ బాధితులైన 10,40,000మందికి రూ.905.57కోట్లు చెల్లించారు.
- ఏపీలోని అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్స్, పాస్టర్లకు ఆర్ధిక సాయంగా 77,290మందికి రూ.37.71కోట్లను చెల్లించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కోవిడ్ ప్రత్యేక సాయం చెల్లింపులో భాగంగా 1,35,05,339మందికి రూ.1350.54కోట్లు చెల్లించారు.
- వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 4,39,134 మందికి రూ.1257.14 కోట్లు చెల్లించారు. వైఎస్సార్ ఆరోగ్య ద్వారా చికిత్సల రూపంలో 27,39,976మందికి రూ.8845.53 కోట్లను ఖర్చు చేశారు. వైఎస్సార్ కళ్యాణ మస్తు, షాదీతోఫా పథకాల ద్వారా 56,194 మందికి రూ.427.27కోట్లను చెల్లించారు. గృహ నిర్మాణాల లబ్దిదారులకు నేరుగా సాయం అందించడం ద్వారా 21,31,564మందికి రూ.12,295.97కోట్లను చెల్లించారు. జగనన్న తోడు వడ్డీ చెల్లింపు పథకం ద్వారా 15,87,492 మందికి రూ.88.33కోట్లను చెల్లించారు.
- ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వరా 2019 జూన్ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి మొత్తం 8,35,04,830 మందికి రూ.2,58,855.97కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఈ పథకాల్లో అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణ మస్తు, షాదీతోఫా వంటి పథకాల్లో కేవలం మహిళల్ని మాత్రమే లబ్దిదారులుగా గుర్తించారు.
ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో 8.35కోట్ల మహిళలకు లబ్ది చేకూరినట్టు ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. పరోక్షంగా లబ్ది చేకూర్చిన పథకాలను కలిపితే లబ్దిదారుల సంఖ్య 12.84కోట్లకు చేరుతుంది. మార్చి నెలలో షెడ్యూల్ వెలువడటానికి ముందుకు ప్రకటించిన నగదు బదిలీ పథకాల లబ్దిదారులను మహిళలను కలిపితే డిబిటి స్కీమ్స్ ద్వారా నగదు అందుకున్న లావాదేవీల సంఖ్య దాదాపు 9కోట్లకు చేరువలో ఉంటుందని అంచనా. 2024 జనవరి- మార్చి మధ్య కాలంలో పలు పథకాలకు నిధులు విడుదల చేస్తున్నట్టు జగన్ బటన్ నొక్కినా అవి వారి ఖాతాలకు చేరలేదు.
కొత్త ప్రభుత్వం ముందు పెను సవాళ్లు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉన్నఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. ఓ వైపు సంక్షేమ పథకాలను కొనసాగించడం మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం కత్తిమీద సాముగా మారింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల చెల్లింపు భారాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉండటం ప్రభుత్వాన్ని ఊపిరిసలపనివ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు ఆర్థిక వెసులుబాటు అందకపోతే పాలన ముందుకు నడవలేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెనుక ఉద్దేశం కూడా ఇదేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ముందు ఉన్న ఆర్థిక సవాళ్లను కేంద్రానికి మొరపెట్టారు.
(ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, సవాళ్లు మరో కథనంలో)