Andhra Debts: ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 4,42,442 కోట్లు, తెలంగాణ అప్పులు రూ.3,66,306కోట్లు..
25 July 2023, 11:41 IST
- Andhra Debts: ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 4,42,442 కోట్లకు చేరింది.తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.3,66,306కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. అటు కేంద్రం అప్పుల భారం తొమ్మిదేళ్లలో రెండు రెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.
కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Andhra Debts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పులు రూ.4.42లక్షల కోట్లకు చేరాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు రూ.3,66,306 కోట్లని వెల్లడించారు. లోక్‌సభలో బిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
ఏపీలో 2019 నాటికి అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నాయి.నాలుగేళ్లలో అవి రూ.4.42లక్షల కోట్లకు చేరాయి.15.3 శాతం నుంచి 12.2శాతానికి అప్పుల భారం చేరిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు 2020లో రూ.3,07,672 కోట్లు (బడ్జెట్ కేటాయింపుల్లో 16.3 శాతం), 2021లో రూ.3,53,021 కోట్లు (14.7 శాతం), 2022లో రూ.3,93,718 కోట్లతో 11.5 శాతంగా ఉన్నాయి. 2023బడ్జెట్ అంచనాలో రూ. 4,42,442లక్షల కోట్లు అప్పుగా ఉన్నట్లు తేల్చారు.
తెలంగాణకు 2019 మార్చి నాటికి రూ.1,90,203 కోట్లుగా ఉన్న అప్పు 2023 మార్చి నాటికి రూ.3,66,306 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ పేరుతో రూ.1407.97 కోట్లు, తెలంగాణ హార్టీకల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.526.26 కోట్లు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ పేరుతో రూ.6528.95 కోట్లు, క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్స్ నుంచి టీఎస్‌సీఎస్‌సీఎస్‌ఎల్ రూ.15,643 కోట్లు, టీఎస్ మార్క్‌ఫెడ్ రూ.483 కోటు, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.4,263 కోట్లు, వేర్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి రూ.66.54 కోట్లు అప్పులు తీసుకున్నట్లు వివరించారు.
తెలంగాణలో 2019లో రూ.1,90,203 కోట్లు అప్పు ఉంటే అది ఈ ఏడాది రూ.3.66లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ కేటాయింపుల్లో అప్పుల శాతం 18.7 శాతం నుంచి 16.6శాతానికి తగ్గింది. తెలంగాణలో 2020లో అప్పులు రూ.2,25,418 కోట్లతో 18.5 శాతం కాగా, 2021లో రూ.2,71,259 కోట్లుగా 20.3 శాతంతో ఉన్నాయి. 2022లో రూ. 3,14,136 కోట్లతో బడ్జెట్‌లో 15.8 శాతంగా ఉన్నాయి. 2023 బడ్జెట్ అంచనాలో తెలంగాణ అప్పుల వాటా రూ.3,66,306 కోట్లతో 16.6 శాతంగా ఉంది.
ఏపీలో అతి తక్కువ తలసరి ఆదాయం…
మరోవైపు తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువ ఉందని గణాంకాలు వెల్లడించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉందని కేంద్ర గణాంకాల వ్యవహారాలశాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ సమాధానంగా వెల్లడించారు.
ఏపీ తలసరి ఆదాయం తాజా ధరల ప్రకారం 2022-23లో రూ.2,19,518 ఉండగా, స్థిర ధరల ప్రకారం రూ.1,23,526కే పరిమితమైంది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732, స్థిర ధరల ప్రకారం రూ.1,64,657 ఉంది. కర్ణాటక తలసరి ఆదాయం రూ.3,01,673, స్థిర ధరల ప్రకారం రూ.1,76,383గా ఉంది. తాజా ధరల ప్రకారం తెలంగాణ దక్షిణాదిలో ప్రథమ స్థానంలో నిలిచినా, స్థిర ధరల కొలమానంలో మూడో స్థానంలో ఉంది. కర్ణాటక ప్రథమస్థానంలో నిలిచింది.
రెండు రెట్లు పెరిగిన కేంద్రం అప్పులు…
కేంద్రంలో 2014 మార్చి 31 అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.58.6 లక్షల కోట్లుగా ఉంది. 2023 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.155.6 లక్షల కోట్లతో జిడిపిలో 57.1 శాతంకు పెరిగింది. సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అప్పు ప్రతి ఏడాదీ పెరుగుతూనే ఉంది. అప్పుకు చెల్లిస్తును వడ్డీ కూడా ప్రతి ఏడాదీ పెరుగుతూనే ఉంది.