Chandrababu Revanth Meeting : ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ- కమిటీలతో విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయం
06 July 2024, 21:55 IST
- Chandrababu Revanth Meeting : విభజన సమస్యపై హైదరాబాద్ లో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. సమస్యల పరిష్కారానికి మంత్రులు, అధికారులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
Chandrababu Revanth Meeting : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. హైదరాబాద్ ప్రజాభవన్ ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. పెండింగ్ సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన సమస్యలపై కూడా చర్చించారు. అలాగే షెడ్యూల్ 10లోని అంశాలపైనే ముఖ్యంగా చర్చించారు. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఇరు రాష్ట్రాల సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
చర్చలతోనే పరిష్కారం
చర్చల ద్వారా, పట్టు విడుపులతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని సమాచారం. నీటి కేటాయింపులపై మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కలిపిన 7 ముంపు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి అడిగారని సమాచారం. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరినట్టు సమాచారం. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కొన్ని భవనాలు తమకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరగా... అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి.
విభజన సమస్యలపై కమిటీ
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. విభజన సమస్యలను కమిటీల ద్వారా పరిష్కారించుకోవాలని నిర్ణయించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అధికారుల కమిటీతో సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించామన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాని అంశాలను ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారించుకోవాలని నిర్ణయించామన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ కట్టడికి తెలుగు రాష్ట్రాలు కలిసి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సీఎంలు ముందుకు రావడం హర్షించదగిన పరిమాణం అని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలో సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.