Awards For CGR : ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికైన సీజీఆర్ సభ్యులు, జులై 6న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం
Awards For CGR : ప్రముఖ పర్యావరణ సంస్థ సీజీఆర్ సభ్యులు నలుగురికి క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ అవార్డు దక్కాయి. ఈ కార్యక్రమాన్ని జులై 6న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు.
Awards For CGR : దిల్లీకి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ "క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ" నుంచి 'కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్'(సీజీఆర్) సభ్యులు జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.
1. పర్యావరణ జాతీయ అవార్డు -డా.కె. తులసీ రావు,
2. నూకల నరోత్తమ్ రెడ్డి జాతీయ అవార్డు- దిలీప్ రెడ్డి,
3. ప్రొ.టి. శివాజీరావు జాతీయ - దొంతి నర్సింహారెడ్డి,
4.ఎర్త్ కేర్ ఎన్విరాన్మెంట్ జాతీయ అవార్డు - డా.ఎ. కిషన్ రావు.
ప్రభుత్వాలు సమర్ధంగా పనిచేయడానికి, సమాజం సమున్నతంగా ఎదగడానికి బలమైన పౌరసమాజం ఉండాలని కోరుకున్న జస్టిస్ కృష్ణఅయ్యర్, జస్టిస్ భగవతి న్యాయకోవిదులు, ఇతర మేధావులు 'క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ' ఏర్పాటు చేశారు. ప్రజా సంబంధం ఉన్న కీలక అంశాలపైన ప్రముఖుల ప్రసంగాలు, ఆరోగ్యవంతమైన చర్చ, జనహితంలో సాగే మంచి పనుల్ని గుర్తించి అవార్డులతో ప్రశంసించడం వంటి కార్యకలాపాలను మూడున్నర దశాబ్దాలుగా ఈ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తొలిసారి దిల్లీ బయట హైదరాబాద్ లోని ప్రఖ్యాత న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్ తో కలిసి సాంకేతిక పరిజ్ఞానం, న్యాయం, మానవీయత (టెక్నాలజీ లా అండ్ హ్యుమానిటీ) అంశంపై భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
జులై 6న అవార్డులు ప్రదానం
దేశంలోని ఆయా రంగాల్లో విశేషంగా కృషిచేసిన పలువురికి ఈ ఫౌండేషన్ తరపున అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించి అవార్డులు ప్రదానం చేయనున్నారు. జులై 6న మధ్యాహ్నం గం.3.30 లకు నల్సార్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ.కె.పట్నాయక్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అతిథిగా పాల్గంటారు. హైదరాబాద్ కేంద్రంగా గత ఒకటిన్నర దశాబ్దాలుగా పర్యావరణ రంగంలో పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ గ్రీన్రివల్యూషన్ (సీజీఆర్) కుటుంబ సభ్యులుగా ఉన్న నలుగురు ముఖ్యులు ఈసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారు.
36 లక్షల మొత్తలు నాటిన సీజీఆర్
2010 లో ఆవిర్భవించిన నుంచి ఇప్పటివారు దాదాపు 36 లక్షల మొక్కల్ని నాటడమే కాకుండా వివిధ మార్గాల్లో పర్యావరణ స్పృహ అవగాహన పెంపొందించే కార్యక్రమాలను సీజీఆర్ నిర్వహిస్తోంది. తూర్పు కనుమల పరిరక్షణకు 'గ్రేస్' వేదికను, పర్యావరణ సుస్థిరాభివృద్ధి రంగాల్లో అవగాహన, శిక్షణ వంటి పనులతో ఓ ఎర్త్ సెంటర్ ను సీజీఆర్ నడుపుతోంది. పల్లెలు, పట్టణాలు, పాఠశాలల నుంచి కాలేజీలు, యూనివర్సిటీల వరకు సభలు, సమావేశాలు, సదస్సులు, సెమినార్స్ ఏర్పాటు చేసి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. వీరిలో నలుగురికి అవార్డులు రావడం వ్యక్తిగతంగా వారి బాధ్యతను, సీజీఆర్ ఉమ్మడి కర్తవ్యాన్ని మరింత పెంచినట్టే లెక్క అని అభిప్రాయపడుతున్నారు సీజీఆర్ సభ్యులు. ఇది ఇంకా ఎందరెందరికో స్ఫూర్తి, ప్రేరణ కలిగించాలని కోరుతున్నామన్నారు.
ఇతర అవార్డు గ్రహీతలు జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ లాంబా, పరాగ్ పి త్రిపాఠి, ఎస్.ఎస్.నాగానంద్, ప్రొ. గోవర్ధన్ మెహతా, ప్రొ.ఆర్ శివరామ్ ప్రసాద్ లకు సీజీఆర్ అభినందనలు తెలిపింది. ఈ అవార్డు గ్రహీతలు అందరి కృషిని అభినందించి, వారి నుంచి స్ఫూర్తి పొందడమే కాకుండా ఎవరిస్థాయిలో వారు వ్యక్తిగతంగా కూడా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సీజీఆర్ కోరుతుంది.
సంబంధిత కథనం