Tirupati Laddu : ఏడు కొండల వెంకన్న లడ్డూకు 307 ఏళ్లు
03 August 2022, 7:02 IST
- తిరుపతికి వెళ్లామని ఎవరికైనా చెబితే.. అవునా మరి లడ్డూ ఎక్కడా? అనే ప్రశ్న వేస్తారు. శ్రీవారి దగ్గరకు వెళ్లామంటే.. లడ్డూ తేవాల్సిందే. ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూకు ఎంతో చరిత్ర ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
తిరుపతి లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్కడకు వెళ్లినవారు.. వీలైనన్నీ ఎక్కువ లడ్డులను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. తలా కొంచెం ప్రసాదంగా పెట్టి సంతోషపడతారు. తెచ్చినవారికి... తిన్నవారికి పుణ్యం అని ఓ నమ్మకం. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ లడ్డూ 307 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. ఆగష్టు 2వ తేదీ 1715 సంవత్సరంలో తొలి సారిగా లడ్డూ తయారుచేసి స్వామివారి నైవేద్యంగా పెట్టారని చరిత్రలో ఉన్నట్టుగా చెబుతారు. అప్పుడు ప్రారంభించిన లడ్డూ తయారీ.. ఇంకా కొనసాగుతూనే ఉంది.
అంతెందుకు.. మీరు ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్లినా.. తిరుమల శ్రీవారి లడ్డూ లాంటి రుచి మాత్రం ఎక్కడా దొరకదు. ఆ టెస్ట్.. తిరుమల లడ్డూకే సొంతం. తిరుమల లడ్డూను తినడం వల్ల స్వామి వారి ఆశీర్వాదం దొరుకుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకే లడ్డూ అంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అయితే తిరుమల లడ్డూలో ఏమేం కలుపుతారో.. చాలామందికి తెలుసు. కానీ ఎవరూ చేసినా.. ఆ రుచి మాత్రం రాదు. శ్రీవారి ఆలయంలో చేసే.. లడ్డూలే రుచికరంగా ఉంటాయి. శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఆ లడ్డూలకు అంత రుచి వచ్చిందని చెబుతారు. తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా ఉంది. ఈ లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు ఉంటాయి.
ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీవారి ప్రసాదం క్రీ.శ. 1803లో బూందీగా పరిచయమైంది. 1940 నాటికి లడ్డూగా మారిందని చెబుతుంటారు. అయితే అంతకు ముందు శ్రీవారికి వివిధ రకాల నైవేద్యాలు పెట్టేవారు. కాలక్రమేణా మారుతూ.. వచ్చాయి. తొలి రోజుల్లో లడ్డూ పరిమాణం 'కల్యాణోత్సవం లడ్డూ' అంతగా ఉండేదని చెబుతారు. ఎన్నో గ్రంథాల్లోనూ తిరుపతి లడ్డూ ప్రస్తావన ఉంది. 1715 సంవత్సరం ప్రకారం తిరుపతి లడ్డూకు 307 ఏళ్లు. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు 82 ఏళ్లు అన్నమాట.