తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Heavy Rains In Telugu States With Unusual Climatic Conditions

Rain Alert to Telugu States : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

B.S.Chandra HT Telugu

15 October 2022, 9:35 IST

    • Rain Alert to Telugu States తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో  పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rain Alert to Telugu States తెలుగు రాష్ట్రాలను భారీవర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో రానున్న మూడు రోజులపాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. శనివారం విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ వాఖ తెలిపింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలోని సత్యసాయి జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలు వరదనీటితో అల్లాడుతున్నాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల దగ్గర పెద్దచెరువువంకలో ఓ ప్రైవేట్‌ బస్సు ఆగిపోయింది. బస్సులోని 30 మంది విద్యార్థులను పోలీసులు, స్థానికులు కలిసి కాపాడారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సుమద్రం చెరువు ఉధృతికి ఓ లారీ అదుపుతప్పింది. వాగు ఉధృతికి బెంగళూరు – కదిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిత్రావతి నది మహోగ్రరూపం దాల్చడంతో బుక్కపట్నం-కొత్తచెరువు మధ్య ప్రయాణాలు ఆగిపోయాయి.

అల్లూరి జిల్లాలో వరద బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రాణాలకు తెగించి వాగులోంచి తాళ్లసాయంతో ప్రయాణం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో భారీవర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు మండలాలను భారీవర్షం అతలాకుతలం చేసింది.

పులిచింతల వరద ఉధృతిలో ఇసుకలోడుకు వచ్చిన లారీలు చిక్కుకుపోయాయి. లారీ డ్రైవర్లను స్థానికులు అతికష్టమ్మీద కాపాడారు. భారీవరదలతో గోదావరి రోడ్ కమ్‌ రైల్వే బ్రిడ్జిని మూసేయడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కర్నూలు జిల్లా వేదావతి ఉధృతికి బ్రిడ్జి దిమ్మ కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు రెండురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వరదప్రవాహంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

నీట మునిగిన పంటలు..

తెలంగాణలోనూ భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షబీభత్సానికి జోగులాంబ జిల్లా అయిజ పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతితో బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఇద్దరు యువకులు బైకుతో వాగుదాటేందుకు ప్రయత్నించి వాగులో పడిపోయారు. స్థానికులు బైక్‌తోసహా వారిని క్షేమంగా కాపాడారు. వరదకష్టాలతో ఆదిలాబాద్‌ గిరిజనులు అల్లాడుతున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసాలో రైతులు నిరసనకు దిగారు.

మూడ్రోజుల పాటు వర్షాలు…..

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, యశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,సంగారెడ్డి, వికారాబాద్‌, కామారెడ్డి మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం , పరిసరప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల 11న ఉత్తర అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విస్తారంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా వెనుదిరుగుతున్నాయి. రాగల మూడు రోజుల్లో మధ్యభారత దేశంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత వెనుదిరిగే పరిస్థితులు ఉన్నాయి.

మరోవైపు ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఏపీకి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం…ఏర్పడనుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనం కానుంది. ఆ తర్వాత తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ఏర్పడితే Sitrang గా నామకరణం చేయనున్నారు. పైన ప్రభావం ఉండనుందని గుర్తించారు.