Nagarjuna University Student : నాగార్జున వర్సిటీలో పాముకాటుతో మయన్మార్ విద్యార్థి మృతి, పుట్టగొడుగుల కోసం వెళ్లి!
08 September 2024, 16:55 IST
- Nagarjuna University Student : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పాముకాటులో విద్యార్థి మృతి చెందాడు. మయన్మార్ కు చెందిన విద్యార్థి శనివారం సాయంత్రం పాముకాటుకు గురై మరణించాడు. వర్సిటీలో పుట్టగొడుగుల కోసం వెళ్లిన విద్యార్థిని విష సర్పం కాటు వేసింది.
నాగార్జున వర్సిటీలో పాముకాటుతో మయన్మార్ విద్యార్థి మృతి
Nagarjuna University Student : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. ఎ.ఎన్.యూలో బుద్ధిజంపై ఎంఏ చేస్తున్న కొండన్న శనివారం సాయంత్రం వర్సిటీలో పుట్టగొడుగులు సేకరించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో రక్తపింజర పాము విద్యార్థిని కాటు వేసింది. వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విద్యార్థి మృతి చెందిన విషయాన్ని మయన్మార్‌లోని అతడి తల్లిదండ్రులకు తెలియజేసినట్లు ఏఎన్‌యూ అధికారులు తెలిపారు.
అసలేం జరిగింది?
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరితో పాటు పలు దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వర్షాకాలం కావడంతో యూనివర్సిటీ పరిసరాల్లో పుట్టగొడుగులు పెరిగాయి. వీటిని స్థానికులు వంటకు ఉపయోగిస్తారు. నాగార్జున యూనివర్సిటీలో మయన్మార్ కు చెందిన కొండన్న అనే విద్యార్థి బుద్ధిజం కోర్సు చదువుతున్నాడు. కొండన్న కూడా పుట్ట గొడుగుల కోసం వర్సిటీలోని పరిసరాల్లో వెతికేందుకు వెళ్లాడు. శనివారం సాయంత్రం వర్సిటీలో పుట్టగొడులు కోసం వెళ్లిన కొండన్నను విషసర్పం కాటువేసింది. ఆ పామును రక్త పింజర అని స్థానికులు గుర్తించారు.
కొండన్నను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా విష ప్రభావంతో అతడు మార్గ మధ్యలో మరణించాడు. విద్యార్థి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. విద్యార్థి మృతిచెందిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థి దురదృష్టవశాత్తు మరణించాడని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం కాబట్టి పాములు సంచరించే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులను కోరారు.
పాముతో రీల్స్ ప్రాణం తీసింది
కామారెడ్డి జిల్లా బాన్సువాడ దేశాయిపేట గ్రామానికి చెందిన శివ రాజులు తండ్రి స్నేక్ క్యాచర్ పనిచేస్తున్నాడు. అయితే తన కుమారుడికి కూడా పాములు పట్టడం నేర్పించాడు. వారి గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి దాదాపు ఆరు అడుగుల విషసర్పం వచ్చింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్ గంగారంను పిలిచారు. అతడు నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ పామును కుమారుడు శివరాజులకు ఇచ్చి వీడియో తీసి పోస్టు చేయమని చెప్పాడు. అతడు పాముతో విన్యాసాలు చేసి, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. పాము తలను తన నోట్లో పెట్టుకొని శివరాజులు రీల్స్ చేశాడు. పాము తలను నోట్లో పెట్టుకున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీశారు. పామును నోటిలోంచి బయటకు తీస్తున్న క్రమంలో.... పాము ఒక్కసారిగా యువకుడి చేతిపై కాటు వేసింది. వెంటనే స్థానికులు అతడ్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరం మెుత్తం వ్యాపించడంతో యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో విషసర్పాలతో ఆటలు ప్రాణాలకే ముప్పు అని మరోసారి రుజువైంది.