Guntur Crime : గుంటూరులో దారుణం.. అప్పు ఇచ్చిన వారిని సైనేడ్‌తో చంపుతున్న మహిళలు.. పోలీసుల విచారణలో ట్విస్ట్-women killing money lenders in guntur with cyanide ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Crime : గుంటూరులో దారుణం.. అప్పు ఇచ్చిన వారిని సైనేడ్‌తో చంపుతున్న మహిళలు.. పోలీసుల విచారణలో ట్విస్ట్

Guntur Crime : గుంటూరులో దారుణం.. అప్పు ఇచ్చిన వారిని సైనేడ్‌తో చంపుతున్న మహిళలు.. పోలీసుల విచారణలో ట్విస్ట్

Basani Shiva Kumar HT Telugu
Sep 06, 2024 04:28 PM IST

Guntur Crime : గుంటూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలే సైనేడ్‌తో నలుగురిని చంపేశారు. ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. అది కూడా అప్పులు ఇచ్చిన వారినే టార్గెట్ చేసి చంపేశారు. ఈ ఘటన గుంటూరులో కలకలం సృష్టించింది.

గుంటూరు సైనేడ్ కిల్లింగ్స్
గుంటూరు సైనేడ్ కిల్లింగ్స్ ( Photo Source: wikipedia)

గుంటూరులో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పులు ఎగ్గొట్టేందుకు హత్యలు చేస్తున్నారు. అప్పు ఇచ్చిన వారిని టార్గెట్ చేసి మహిళలు సైనేడ్‌తో చంపుతున్నారు. గుంటూరులో మొత్తం నలుగురిని చంపారు. ఈ వ్యవహారంలో ముగ్గురు మహిళలు కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మహిళలు మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. జూన్‌లో జరిగిన మహిళ హత్య కేసుతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చారు. ముగ్గురు మహిళలతో పాటు.. సైనేడ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ సతీష్ వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. గుంటూరు ఉలిక్కిపడింది.

వరుస హత్యల కలకలం..

ఇటీవలి కాలంలో గుంటూరు నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టించాయి. ఈ హత్యలపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. హత్యలు చేస్తున్న మహిళల ముఠాను అరెస్ట్ చేశారు. అటు పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ విషయాలు తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. మహిళలు ఇంత దారుణంగా ఆలోచిస్తారా అని ఆశ్చర్యపోయారు.

బ్రీజర్‌లో సైనేడ్ కలిపి..

'2023 జూన్‎లో నాగూర్‎బీ అనే మహిళ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆమె మృతిపై కేసు నమోదు చేశాం. బ్రీజర్‎లో సైనైడ్ కలిపి ఇవ్వడంతోనే మహిళ మృతి చెందింది. సదరు మహిళను హత్య చేసినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టాం. ఈ నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలు చేయడానికి గోల్డ్ షాపులో వాడే సైనైడ్‎ను ఉపయోగించారు' అని ఎస్పీ సతీష్ వెల్లడించారు.

ముగ్గురు తప్పించుకున్నారు..

'సైనేడ్‌తో ఇప్పటి వరకు నలుగురిని హత్య చేశారు. మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. ఆహారం‎, డ్రింక్‎లో సైనైడ్ కలిపి ఈ మహిళలు నేరాలకు పాల్పడ్డారు. 2022 నుంచి ఈ తరహా నేరాలను ముఠా కొనసాగిస్తోంది. డబ్బు కోసం, అప్పులు ఎగ్గొట్టేందుకు ఈ హత్యలు చేశారు' అని ఎస్పీ సతీష్ వివరించారు.

సైనేడ్ ఎక్కడిది..

ఈ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. ఈ ముగ్గురి మహిళల్లో ఒకరు గతంలో వాలంటీర్‎గా పని చేశారని తెలుస్తోంది. మహిళలకు సైనైడ్ విక్రయిస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అయితే.. అతనికి సైనేడ్ ఎక్కడిదనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇంకా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.