ganesh chaturthi 2024 : గణేష్ వేడుకల్లో అపశృతి... మండపంలో కరెంట్ షాక్ తో ఇంటర్ విద్యార్థి మృతి
07 September 2024, 17:28 IST
- ganesh chaturthi 2024 : తొలి పూజలు అందుకుని.. విఘ్నాలను తొలగించే వినాయకుడి వేడుకల్లో విషాదం జరిగింది. గణేష్ మండపంలో కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. పండుగ పూట యశ్వంత్ ఇంట విషాదం నిండింది. ఈ ఘటన హుజురాబాద్ మండలంలో జరిగింది.
కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి
హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు విషాదంగా మారాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవ యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపం వద్ద విద్యుత్ వైర్లు సరి చేస్తున్న క్రమంలో.. గ్రామానికి చెందిన వెంకటేశ్ - లావణ్యల ఏకైక పుత్రుడు యశ్వంత్ షాక్‌కు గురయ్యాడు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. యశ్వంత్‌ను వెంటనే హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏకైక కొడుకు పండుగ పూట కరెంట్ షాక్ గురై ప్రాణాలు కోల్పోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటర్ చదివే కొడుకు గణేష్ వేడుకలకు హాజరై ప్రాణాలు కోల్పోయాడని.. కాలేజీలో ఉన్నా ప్రాణం దక్కేదని కన్నీటిపర్యంతమయ్యారు.
వాడవాడనా కొలువుదీరిన బొజ్జగణపయ్య..
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడన బొజ్జగణపయ్య కొలువుదీరారు. విభిన్న ఆకృతుల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో బొజ్జగణపయ్యలను కొలుస్తున్నారు. డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా.. అందంగా అలంకరరించిన మండపాలకు గణేష్ విగ్రహాలు తరలిస్తున్నారు.
కరీంనగర్‌లో పదివేల మట్టి విగ్రహాల పంపిణీ..
కెమికల్‌తో తయారు చేసే విగ్రహాలతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో మట్టి విగ్రహాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. అంటూ నగరంలో పదివేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి గణపతి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షించడంతోపాటు మానవాళి మనుగడకు ఎంతో దోహదపడుతుందని.. కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు వ్యాఖ్యానించారు. గణేష్ ఉత్సవాల కోసం 60 లక్షలతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)