తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pcc President : ఎవరా శకుని మామ.... ఏమిటా కథ...?

AP PCC President : ఎవరా శకుని మామ.... ఏమిటా కథ...?

HT Telugu Desk HT Telugu

25 November 2022, 7:25 IST

    • AP PCC President ఆంధ్రప్రదేశ్ పిసిస అధ్యక్షుడి మార్పు వ్యవహారం పార్టీలో దుమారం రేపింది. సాకే శైలజానాథ్‌ స్థానంలో గిడుగు రుద్రరాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసిసి ప్రకటన జారీ చేయడంతో అసంతృప్త నాయకులు బహిరంగంగానే తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఏకంగా తనకు ఏ పదవి అవసరం లేదంటూ పార్టీ నాయకత్వానికి లేఖ కూడా రాశారు. అంతటితో ఊరుకోకుండా మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఇదంతా శకుని మామ పనేనంటూ బాంబు పేల్చారు.
ఏపీ పిసిసి అధ్యక్షుడి నియామకంతో కొత్తరగడ
ఏపీ పిసిసి అధ్యక్షుడి నియామకంతో కొత్తరగడ

ఏపీ పిసిసి అధ్యక్షుడి నియామకంతో కొత్తరగడ

AP PCC President ఏపీ పిసిసి అధ్యక్షుడి నియామక వ్యవహారం ఏపీ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను తప్పించడం వెనుక కారణాలు ఏమిటనే చర్చ పార్టీలో జరుగుతోంది. శైలజానాథ్‌ను తొలగించడంపై ఎవరు అభ్యంతరం చెప్పకపోయినా, ఆ స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ,బీసీ వర్గాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని విమర్శలు ఎదురవుతున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రభావితం చేసిందెవరనే చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

పాదయాత్ర చేయాలనుకోవడమే కారణమా...

పిసిసి అధ్యక్షుడిని అకస్మాత్తుగా మార్చేయడంపై ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పీసీసీ కొత్త కార్యవర్గ నియామకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక నాయకుడు ప్రభావితం చేశారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి శైలజానాథ్‌ పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భావించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావాలంటే ప్రస్తుతం పాదయాత్ర చేపట్టడం ఒక్కటే మార్గమని శైలజానాథ్‌ భావించారట. పాదయాత్ర కోసం శైలజానాథ్‌ సిద్ధమవుతున్న సమయంలోనే అనూహ్యంగా కొత్త కార్యవర్గాన్ని ఏఐసిసి ప్రకటించింది. శైలజానాథ్‌ను పదవి నుంచి తప్పించి గిడుగు రుద్రరాజును నియమించడం వెనుక పార్టీ సీనియర్ ఒకరు చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పిసిసి అధ్యక్షుడి నియామకానికి పరిమితం కాకుండా, ఒకేసారి కార్యవర్గాన్ని మార్చేయడం వెనుక కొందరి మంత్రాంగం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని బలపడనీయకుండా చేయడం కోసమే తాజా నియామకం జరిగిందని ఆరోపిస్తున్నారు. మాజీ సిఎం వైఎస్.రాజశేఖర్‌ రెడ్డి హయంలో కీలక పాత్ర పోషించిన నాయకులే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడి నియామకం విషయంలోను కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పీసీసీ అధ్యక్షుడిని మార్చారని ఆరోపిస్తున్నారు. ఏఐసీసీఅధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేసిన నాయకుడి సూచనలతోనే గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు.

శకుని మామ ఉన్నంత వరకు పార్టీకి కష్టమే.....

కాంగ్రెస్‌ పార్టీలో శకుని మామ ఉన్నంతవరకు బతికి బట్టకట్టదని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్న వేళ చేసిన నియామకాలను తప్పు పట్టారు.ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీల అధ్యక్షులు అగ్రకులానికి చెందిన వాళ్లే ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కూడా దళితుడిని తప్పించి అగ్రవర్ణాలకు అద్యక్ష పదవిని ఇచ్చారని ఆరోపించారు.

దళితుల్ని టీడీపీ, వైఎస్సార్సీపీలు మోసం చేశాయని ప్రజలు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకం దళిత వర్గంలో తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆరోపించారు.

పీసీసీ కార్యవర్గ కూర్పు అమలాపురం కాంగ్రెస్ కమిటీ అనే అభిప్రాయం కలుగ చేస్తోందని ఎద్దేవా చేశారు. అధ్యక్షుడు అమలాపురం, వర్కింగ్ ప్రెసిడెంట్ అమలాపురం, ప్రచార కమిటీ ఛైర్మన్ అమలాపురం ఏమిటని హర్షకుమార్ ప్రశ్నించారు. కాకినాడ నుండి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు ఏఐసిసి కార్యక్రమాలు అమలు చేసే కమిటీ చైర్మన్‌గా ఉన్నారని విమర్శించారు. ఏఐసిసి ఏర్పాటు చేసింది జిల్లా కమిటీనా, రాష్ట్ర కమిటీనో తెలియడం లేదన్నారు.

కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన పళ్లంరాజుకు కార్యక్రమాల కమిటీ బాధ్యతలు ఇచ్చారని ఇది కాపుల్ని అవమానించడమేనని అగ్గి రాజేశారు. కాపులు జనసేనతో వెళ్తున్న పరిస్థితుల్లో పల్లంరాజును అవమానించడం ఘోర తప్పిదమన్నారు. వైఎస్సార్‌ ఉన్నప్పట్నుంచి ఇంచార్జిలను కొని, తతంగం నడపడం శకునిమామ ప్రత్యేకత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి తెలియకుండా పనులు చేయడంలో సిద్ధహస్తుడని ఆరోపించారు. హర్షకుమార్‌ పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించినా ఆయన కేవీపీ రామచంద్రారావును ఫోటో పెట్టి శకునిమామ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం వైరల్‌గా మారింది.

టాపిక్