AP Volunteers : వరద బాధితుల నోట వాలంటీర్ల మాట.. వారి సేవలు మరువలేమంటున్న ప్రజలు!
06 September 2024, 18:33 IST
- AP Volunteers : రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే వాలంటీర్లపై మరోసారి చర్చ ప్రారంభమైంది. విజయవాడ వరద సమయంలో వాలంటీర్లు ఉండి ఉంటే.. తమకు అన్ని అందేవని బాధితులు చెబుతున్నారు. దీంతో వాలంటీర్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
విజయవాడ సమీపంలో వరద బాధితులు
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది. రాష్ట్రం వ్యాప్తంగా 2,48,779 మంది వాలంటీర్లను నియమించి.. ఒక్కో వాలంటీర్‌కు రూ.5,000 గౌరవ వేతనం ఇచ్చింది. వాలంటీర్ తన పరిధిలోని 50 నుంచి 80 ఇళ్లకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూసేవారు. నిరంతరం వారికి ప్రజలతో సంబంధాలు ఉండేవి.
కరోనాలో సమయంలో..
కేవలం పథకాలు పంపిణీకి మాత్రమే కాకుండా వాలంటీర్లు విపత్కర పరిస్థితుల సమయంలోనూ సేవలు అందించేవారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిరంతరం సేవలను అందించారు. కరోనా ప్రోటోకాల్ అమలు చేయడంలో వాలంటీర్ల పాత్రను, వారి సేవలను మరిచిపోలేము. క్వారెంటైన్ ఉంచడంలోనూ, అలాగే వాలంటీర్ పరిధిలోని ఏ ఇంట్లో కరోనా వచ్చిన పేషెంట్ ఉన్న గుర్తించి, చికిత్సకు ఆసుపత్రులకు పంపడం వంటివి చేసేవారు. సీజనల్ వ్యాధులు సమయంలో సర్వేలు నిర్వహించేవారు. వరదల సమయంలో కూడా ఆయా ప్రాంతాల్లో వాలంటీర్లే సేవలు అందించేవారు.
వాలంటీర్ల సేవలు ప్రజల్లో కూడా ఆదరణ పొందాయి. అయితే.. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, అమలు జరుగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబా నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. పరుష పదజాలంతో వాలంటీర్లపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అందుకు భిన్నంగా వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5,000 నుంచి రూ.10,000 చేస్తామని చంద్రబాబు ఉగాది రోజున ప్రకటించారు.
దాదాపు 2.50 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారి కుటుంబాలు ఇలా దాదాపు 10 లక్షల భారీ ఓటు బ్యాంక్‌తో వాలంటీర్లు ఉన్నారు. దీంతో ఆ భారీ ఓటు బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వాలంటీర్ గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తానని ప్రకటించారు. ఈ సమయంలో కొంత మంది వాలంటీర్‌గా రాజీనామా చేసి ఎన్నికల్లో పని చేశారు. కానీ మెజార్టీ వాలంటీర్లు టీడీపీకి మద్ధతుగా ఉన్నారు. అంతేకాకుండా ఆ వాలంటీర్ల కుటుంబాలకు కూడా టీడీపీకి మద్దతు తెలిపాయి.
ఎన్నికలు జరిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ, ఘోర ఓటమి చెందింది. ఓటమికి గల కారణాల్లో వాలంటీర్ల వ్యవస్థ కూడా ఒకటి అని చర్చ ఉంది. వాలంటీర్లపై వైసీపీ ముద్ర ఉంది. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలని టీడీపీ నేతలు సంభోదించేవారు. కానీ టీడీపీ నేతలకు తెలియాల్సిందేమిటంటే.. వైసీపీకి వ్యతిరేకంగా మెజార్టీ వాలంటీర్లు అంటే, దాదాపు 1.40 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా టీడీపీ పక్షాన నిలబడ్డారు.
ఇప్పుడు వాలంటీర్లకు ఇస్తామన్న రూ.10 వేల గౌరవ వేతనాన్ని అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు నాలుగు సార్లు రాష్ట్ర మంత్రి వర్గ భేటీలు అయ్యాయి. కానీ వాలంటీర్ల పునరుద్ధరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా గత నాలుగు నెలల నుంచి వేతనాలు లేవు. ఇప్పుడు వాలంటీర్ల కుటుంబాలు సంక్షోభంలోకి వెళ్లాయి. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవద్దని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే వాలంటీర్లు ఉంటే, స్థానికంగా తమ మాట చెల్లదనే టీడీపీ కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా.. విజయవాడలో వరదలు ఒక్కసారిగా విజృంభించాయి. దీంతో విజయవాడ అతలాకుతలం అయింది. బాధితులకు సహాయక చర్యలు సవ్యంగా జరగలేదు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల అంశం తెరపైకి వచ్చింది. వాలంటీర్లే ఉండి ఉంటే, తమకు ఈ తిప్పలు తప్పేవని బాధితులు అంటున్నారు. కరోనా లాంటి సమయంలో వాలంటీర్లు తమకు ఎలాంటి సేవలు అందించారో బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ, టీవీల్లోనూ అదే చర్చ జరిగేది. వాలంటీర్లు ఉంటే సహాయ చర్యలు మరింత సమర్ధవంతంగా జరిగేవని, శివారు ప్రాంతాలకు కూడా అన్ని రకాల సేవలు అందేవని అభిప్రాయపడుతున్నారు.
దీంతో ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో పునరాలోచన చేసింది. వరద ప్రబావిత ప్రాంతాల్లో విధులకు హాజరుకావాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సహాయక చర్యల్లో వాలంటీర్లు విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులు అందించారు.
విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు. వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నామని, వారిని కూడా ఉపయోగించుకోవాలని చంద్రబాబు రెండు రోజుల కిందటే ప్రకటించారు. అది కేవలం విజయవాడకు మాత్రమే పరిమితం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు అటువంటి ఆదేశాలు ఏమీ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలుపు ఎప్పుడు వస్తోందనని వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)