Pawan On Volunteers: వాలంటీర్లు లేకున్నా సజావుగా పెన్షన్ల పంపిణీ, వారికి ప్రత్యామ్నయ ఉపాధి చూపిస్తామన్న పవన్ కళ్యాణ్
Pawan On Volunteers: రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోతుందని ప్రచారం చేశారని, వాలంటీర్లు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాలంటీర్ల సేవల్ని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తామన్నారు.
Pawan On Volunteers: వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లనే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రభుత్వ పథకాలను అందించారని, వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేశారని, అలా పంపిణీ చేసినందుకు కొన్ని చోట్ల రూ.100 నుంచి ఎంతో కొంత వాళ్లు వసూలు చేశారని, తమ ప్రభుత్వం ఎక్కడా అలాంటివి జరగకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారీతనం పెంచుతామన్నారు. పిఠాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ పాల్గొన్నారు.
ఎన్నికల్లో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ప్రచారం చేశారని, ఇప్పుడు ఎక్కడా ఆగలేదని, ఇంటి దగ్గరకే పెన్షన్లు వచ్చాయన్నారు. జిల్లా మొత్తమ్మీద 650 సచివాలయాలు ఉన్నాయని, వాలంటీర్లు లేకపోతే రావని అబద్దాలు ప్రచారం చేశారన్నారు.
వాలంటీర్లకు ప్రత్యామ్నయ ఉపాధి ఎలా ఇవ్వాలో తాము ఆలోచిస్తామన్నారు. ఒక్కో సచివాలయానికి పది మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత, జవాబుదారీ తనం ఉంటుందని, సచివాలయ ఉద్యోగి ఎవరు ఇకపై డబ్బులు అడగలేరని, అడిగితే కూటమి నాయకులకు చెప్పాలని పవన్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు అలా చేయరని, ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున లక్ష రుపాయలకు పైగా ప్రభుత్వ డబ్బు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని వాటిని సరిదిద్దే ప్రయత్నం తాము చేస్తున్నామన్నారు.ఇకపై పంచాయితీరాజ్, పర్యావరణ శాఖల్లో అవినీతి ఉండదు, జవాబుదారీతనం పెంచుతామని పవన్ చెప్పారు. ఎవరిని ఇబ్బంది పెట్టి, భయపెట్టేది లేదన్నారు.
తనకు కీలక శాఖలు అప్పగించారని, పంచాయితీరాజ్ శాఖను చూస్తే జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచినీరు అందించే అవకాశం ఉన్నా చేయలేదన్నారు. పక్కనే గోదావరి ఉన్నా తాగు నీరు లేదన్నారు. గోదావరి జిల్లాల్లో తాగడానికి నీరు లేవన్నారు. జలజీవన్ మిషన్‌కు నిధులు ఉన్నా, నీళ్లు లేవు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పంపిణీకి ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి ఉన్నా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదన్నారు.
జలజీవన్ మిషన్‌లో ఒక్కో పథకానికి 70 నుంచి 90 శాతం గ్రాంటు వస్తుందని, వైసీపీ హయంలో ప్రజలకు రక్షిత మంచినీటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకున్నా, రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని దానిని ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తుందన్నారు.
నా కోసం ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదు..
క్యాంప్ ఆఫీసులో తన కోసం ఏమి చేయమంటారని అడిగితే ఎలా ఉందో అలాగే ఉంచాలని చెప్పానన్నారు. అసెంబ్లీలో మూడునాలుగు రోజులు పనిచేస్తే రూ.35వేల జీతం వచ్చిందన్నారని, దానిని తీసుకోడానికి మనస్కరించలేదన్నారు. పని చేయడానికి తన శాఖలో డబ్బులు లేవన్నారు. వీటిని సరి చేయాల్సిన అసరం ఉందన్నారు.
తాను అద్భుతాలు చేసేస్తామని చెప్పనని, కానీ జవాబుదారీగా ఉంటామన్నారు. తన శాఖలో అవినీతి ఉండదని హామీ ఇచ్చారు. పిఠాపురంలో పెన్షన్లుగా 27కోట్లను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి రెండువారాలకు ఓసారి పిఠాపురం వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పెన్షన్ల పంపిణీపై రీ సర్వే చేయాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన ఉంచుతానని చెప్పారు. ప్రతి రెండు వారాలకు ఓసారి జిల్లా కలెక్టర్ వచ్చి నేరుగా సమస్యల్ని తెలుసుకుంటారని చెప్పారు.
చాలాచోట్ల 40శాతం వైకల్యం ఉంటేనే సదరం సర్టిఫికెట్ వస్తుందని, కొన్నిసార్లు 90శాతం వైకల్యం ఉన్నా సర్టిఫికెట్ రావడం లేదని ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు. పిఠాపురంలో నీటి సమస్యలు తీర్చి కనీసం రక్షిత మంచి నీటి సదుపాయాన్ని కల్పించాలన్నది తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు.
వికలాంగులకు కనీసం రూ.10వేలు పెన్షన్లు ఇవ్వాలని కోరితే రూ.15వేలు ఇస్తున్నారని చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కారమైపోవని, చిటికెలో అయిపోెయేలా కృషి చేస్తామన్నారు. గతంలో మాదిరి పార్టీకి కాకపోతే పెన్షన్లు ఇవ్వమనే పరిస్థితి ఉండదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు చెల్లిస్తామన్నారు.
సంబంధిత కథనం