తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Daspalla Lands Issue: విశాఖ దసపల్లా భూముల విలువెంత..? అసలు వివాదమేంటి..?

Daspalla Lands issue: విశాఖ దసపల్లా భూముల విలువెంత..? అసలు వివాదమేంటి..?

HT Telugu Desk HT Telugu

12 October 2022, 13:52 IST

    • daspalla lands in visakhapatnam: దసపల్లా ల్యాండ్స్... గత కొద్దిరోజులుగా ఈ భూముల చుట్టే రాజకీయం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ కు కారణమైంది. అయితే ఈ భూములు ఎవరివి..? ఎంపీ విజయసాయిరెడ్డి వస్తున్న ఆరోపణలు ఏంటి..? గతంలో ఏం జరిగిందనేది చూస్తే…..
విశాఖలో దసపల్లా భూముల వివాదం (ఫైల్ ఫొటో)
విశాఖలో దసపల్లా భూముల వివాదం (ఫైల్ ఫొటో) (twitter)

విశాఖలో దసపల్లా భూముల వివాదం (ఫైల్ ఫొటో)

daspalla land issue in visakhapatnam: దసపల్లా భూములు... విశాఖపట్నం నగరం నడిబొడ్డున వేల కోట్ల విలువచేసేవి..! దశాబ్ధాలుకుపైగా ఈ భూముల పంచాయితీ నడుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మధ్యలో కాస్త అగినప్పటికీ... తాజాగా మరోమారూ తెరపైకి వచ్చారు. కుమార్తె, అల్లుడికి విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం మరోలా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు దసపల్లా భూములు చుట్టూ విజయ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

ఈ భూములు ఎవరివి...?

ఈ భూములు దసపల్లా రాజు వైరిచర్ల నారాయణగజపతిరాజుకు చెందినవి. వీటిని ఆయన... కుమార్తె రాణీ కమలాదేవి పేరున 1938లో వీలునామా రాశారు. ఎస్టేట్‌ అబాలిష్‌మెంట్‌ చట్టం అమల్లోకి రావడంతో అప్పటి అసిస్టెంట్ సెటిల్ మెంట్ అధికారి వాటికి గ్రౌండ్ రెంట్ పట్టా ఇచ్చారు. 1981లో దీనిపై అప్పటి తహశీల్దార్ కోర్టులో అప్పీలు చేయగా కమిషనర్ పట్టాను రద్దుచేసి అవి ప్రభుత్వానివేనని తేల్చారు. అనంతరం అంటే 2001లో వీటిని 22ఏ జాబితాలో చేర్చారు. ఇందులో1196, 1197, 1027, 1028 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇందులోని మొత్తం 60 ఎకరాల భూములుండగా, వీటిలో 40 ఎకరాలను వీఎంఆర్‌డీఏ, నౌకాదళం, జీవీఎంసీ సేకరించాయి. మిగిలిన 20 ఎకరాల్లో 5 ఎకరాలను వివిధ అవసరాలకు కేటాయించగా... ప్రస్తుతం 15 ఎకరాల భూమి ఉంది. వీటి చుట్టే తాజా వివాదం నడుస్తోంది. అయితే వీటి విలువ 2 నుంచి 3 వేల కోట్ల మధ్య ఉంటుందనే చర్చ నడుస్తోంది.

అయితే ప్రభుత్వ జోవలోను కమలాదేవి సవాల్ చేశారు. హైకోర్టులో ఆమెకు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం... సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అత్యున్నత ధర్మాసనం కూడా కమలాదేవికే తీర్పు అనుకూలంగా ఇచ్చింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం 2015 మరోసారి ఈ భూములను 22ఏ జాబితాలోకి చేర్చింది. ఇక ఈ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారంటూ నాడు వైసీపీ కూడా ఆందోళనలు చేపట్టింది. ఈ అంశాన్ని వైసీపీ అధినేత జగన్ కూడా అనేక సార్లు ప్రస్తావించారు. విశాఖలో జరిగిన ఆందోళనలో కూడా పాల్గొన్నారు.

తాజా వివాదం ఏంటీ....

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక...ఈ భూముల అంశం అనేకసార్లు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక నేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు రావటం మొదలైంది. ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయటం, అందులో భాగంగా 22 (ఏ) జాబితా నుంచి ఎత్తివేయాలని నిర్ణయిచటంతో అసలు పంచాయితీ షురూ అయ్యింది. ఈ భూములను ఎంపీ విజయసాయిరెడ్డి తన కుమార్తెకు వచ్చేలా పావులు కదిపారని, అందులో భాగంగానే ఆయన అల్లుడు, కుమార్తెకు చెందిన కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయంటూ ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. 22ఏ ఆంక్షలను‌ అకస్మాత్తుగా ఎత్తివేయడంపై జనసేన, టీడీపీ, సీపీఐ ఆగ్రహం చేశాయి. ఈ వ్యవహారంలో లావాదేవీలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని అంటున్నాయి.

ఎంపీ విజయసాయి ఏమన్నారంటే...

దసపల్లా భూముల వివాదంపై ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. అవి రాణి కమలాదేవికి చెందినవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడంతోనే, 22(ఏ) జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించామని తెలిపారు. ఆ భూముల్లో ఇప్పటికే 400 మంది ఇళ్లు కట్టుకున్నారని... వాటిని ఇప్పుడు కూల్చలేమని స్పష్టం చేశారు. అది ప్రభుత్వ భూమీ కాదన్న ఆయన... అలాంటప్పుడు 22(ఏ) నుంచి తీసేయడంలో తప్పేముంది? అని ప్రశ్నించారు. వాటిని 22(ఏ) నుంచి నిజానికి చంద్రబాబే తొలగించాల్సింది... కానీ అలా చేయలేదు.... అది టీడీపీ సర్కార్ వైఫల్యం అని విమర్శించారు. విశాఖలో తాను అక్రమంగా ఆస్తులు, స్థలాలు కూడబెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై సీబీఐ, ఈడీలతోగానీ... అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐతోగానీ దర్యాప్తునకు సిద్ధమని ప్రకటించారు.

మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు దసపల్లా భూములు వివాదం నడుస్తూనే ఉంది. తాజాాగా 22 (ఏ) నుంచి ఎత్తివేయటం, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు రావటంతో విశాఖ వేదికగా మరోమారు ప్రతిపక్షాలు పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాయి.