AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం
08 May 2024, 15:29 IST
- AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్-2024 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. నేటి నుంచి ఈ నెల 14 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లలో మార్పు చేర్పులు చేసుకునేందుకు కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది.
ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్
AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 23న ప్రారంభమైన అప్లికేషన్లు ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20తో ముగిశాయి. అయితే ఏపీ పీజీఈసెట్ దరఖాస్తు సవరణ విండో నేటి(మే 8) నుంచి ఓపెన్ అయ్యింది. మే 14 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లను సవరించుకోవచ్చు. ఏపీలోని యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీఈసెట్ నిర్వహిస్తోంది. మే 29 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పీజీఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. రూ.5000 ఆలస్య రుసుముతో మే 12 వరకు అభ్యర్థులు పీజీఈసెట్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తుల్లో తమ వివరాలను మార్చుకునేందుకు మే 8 నుంచి 14 వరకు కరెక్షన్ విండో ఓపెన్ చేశారు.
మే 22న హాల్ టికెట్లు జారీ
ఏపీ పీజీఈసెట్ కు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు, లేదా చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గేట్, జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్ల కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏపీ పీజీఈసెట్ ను ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ లో https://cets.apsche.ap.gov.in/PGECET/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను మే 22న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు మే 29 నుంచి 31 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. పీజీఈ సెట్ ప్రాథమిక కీ ను మే 31, జూన్ 1, 2 తేదీల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీ పై జూన్ 2, 3, 4 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 28న పీజీఈసెట్ ఫలితాలు విడుదల చేస్తారు.
ఏపీ పీజీఈసెట్ పరీక్షా విధానం ఇలా?
ఏపీ పీజీఈసెట్ ను మొత్తం 120 మార్కులకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు వారి డిగ్రీ స్థాయిలోని సబ్జెక్టులపైనే ప్రశ్నలు అడుగుతారు. రాంగ్ ఆన్సర్స్ కు ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. పరీక్ష విధానాన్ని అర్థం చేసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ లో మాక్ టెస్టులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు ఉండవు.
తెలంగాణ పీజీఈసెట్
తెలంగాణ పీజీఈసెట్ -2024 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 16వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం కాగా మే 10తో ముగియనున్నాయి. ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి 9 వరకు టీఎస్ పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు https://pgecet.tsche.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ పీజీఈసెట్ నిర్వహిస్తోంది.