తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Dalit Associations Protest Against Bjp Ap President Somu Veerraju And Other Leaders For Land Issues

Protest Against Bjp Somu : సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఆందోళన

HT Telugu Desk HT Telugu

15 February 2023, 7:10 IST

    • Protest Against Bjp Somu ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో సోము వీర్రాజును అడ్డుకునేందుకు దళిత సంఘాలు ప్రయత్నించాయి.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన దళిత సంఘాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. 
సోము వీర్రాజుకు వ్యతిరేకంగా బుక్ ఫెస్టివల్‌లో ఆందోళన చేస్తున్న దళిత సంఘాలు
సోము వీర్రాజుకు వ్యతిరేకంగా బుక్ ఫెస్టివల్‌లో ఆందోళన చేస్తున్న దళిత సంఘాలు

సోము వీర్రాజుకు వ్యతిరేకంగా బుక్ ఫెస్టివల్‌లో ఆందోళన చేస్తున్న దళిత సంఘాలు

Protest Against Bjp Somu పుస్తక ప్రదర్శనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న కాార్యక్రమం రసాభాసగా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేయడానికి దళిత సంఘాలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుక్ ఫెస్టివల్‌లో పాల్గొని తిరిగి వెళుతున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఎదుట దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకులు లక్ష్మీపతిరాజా, వల్లభనేని సుధాకర్‌లు దళితుల భూములను కబ్జా చేసి, దొంగ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారని, తమ భూముల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేయిస్తున్నారంటూ నినాదాలు చేశారు. ఈ విషయమై మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించారు. పక్కన ఉన్న నాయకులు వారించడంతో ఆయన దానిని తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

దళిత సంఘాల నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ 'గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్‌ పరిధిలోని చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న డీ పట్టా నెంబరు 233/బిలో 4404 చదరపు గజాల భూమిని 2014లో గొల్ల వరప్రసాద్‌ కొనుగోలు చేశారని, అదే సర్వే నెంబరులోని మరో 2.30 ఎకరాలను కూడా కొనుగోలు చేయడానికి అగ్రిమెంటు చేయించుకున్నారని, ఈ భూమిలోకి అతడిని రానీయకుండా బద్రిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

ఇద్దరి మధ్య నెలకొన్న వివాదంతో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మీడియా బాద్యుడు లక్ష్మీపతిరాజా, వల్లభనేని సుధాకర్‌ కుట్ర పూరితంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వరప్రసాద్‌ భూమిని కబ్జా చేసి రూ.కోట్లలో లబ్ధి పొందేందుకు చూస్తున్నారని దీనిపై కిషన్‌రెడ్డికి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వస్తే పోలీసులతో అడ్డుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.

సోము వీర్రాజు చర్యలకు నిరసనగా ఫిబ్రవరి 18న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ముట్టడిస్తామని దళిత సంఘాలు ప్రకటించాయి. బీజేపీ నాయకత్వం జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ బీజేపీలో నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో తాజా వివాదం రాజుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

టాపిక్